రాష్ట్ర ప్రజలు సీబీఐ కేసులు లేని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారు

• వైసీపీకి ఓటేసినందుకు రైతులు, భవన నిర్మాణ కార్మికుల్ని నట్టేట ముంచారు
• ఎన్నికల ముందు ఉచిత ఇసుక అన్నారు… ఇప్పుడు బినామీలకు ఇసుక వ్యాపారం అప్పగించారు
• కౌలు రైతుల ఆత్మహత్యల్ని దాచిపెట్టారు
• జగన్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు
• సభలు పెట్టి మరీ పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్నారు
• ధర్మవరంలో మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

ఉమ్మడి అనంతపురం జిల్లా, ధర్మవరం, వైసీపీకి ఓటు వేసినందుకు రైతులు, భవన నిర్మాణ కార్మికులను ఈ ప్రభుత్వం నట్టేట ముంచిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇసుక ఉచితంగా ఇస్తామని, ఇప్పుడు అదే ఇసుకతో వ్యాపారం బినామీల ద్వారా చేసుకుంటున్నారని తెలిపారు. 2 వేల మందికిపైగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ లెక్కలు కూడా దాచి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సభలు పెట్టి ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలకడం మానుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర విజయవంతం కావడాన్ని ఈ సీబీఐ దత్తపుత్రుడు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మంగళవారం ఉమ్మడి అనంతపురం జిల్లా, ధర్మవరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ… పశ్చిమగోదావరి జిల్లా వేదికగా జరిగిన రైతు భరోసా సభలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నట్టు కనబడ్డారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంటే ఆయన్ని తిట్టడానికే ఏదో ఒక సభ పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని ఎంత దగా చేశారో అందరికీ తెలుసు. రైతుల ఆత్మహత్యలకు మీ ప్రభుత్వ విధానాలే కారణం. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది కౌలు రైతులు చనిపోతే 718 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని రైతు భరోసా సభ సాక్షిగా అబద్ధం చెప్పారు. చనిపోయిన వారందరికీ రూ. 7 లక్షల పరిహారం ఎప్పుడో ఇచ్చేశామని ఎవ్వరికీ పెండింగ్ లేవని పచ్చి అబద్దాలు చెప్పారు. పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టి ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాల ఇళ్ల వద్దకు వెళ్లి రూ. లక్ష ఆర్థిక సాయం ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత కొంత మందికి మాత్రమే హడావిడిగా మీరిచ్చిన జీవో 42, 102 మేరకు పూర్తి పరిహారం అందించారు. పవన్ కళ్యాణ్ సాయాన్ని సీబీఐ దత్తపుత్రుడు జీర్ణించుకోలేకపోతున్నారు. లక్షలాది రూపాయిలు ప్రజాధనం ఖర్చు చేసి సభలు పెట్టి మరీ జనసేనాని మీద విషం కక్కుతున్నారు.
• ఏం సాధించారని గడప గడపకు వెళ్తారు
మూడేళ్ల పాలనలో ఆ పథకాలు తెచ్చాం.. ఈ పథకాలు తెచ్చాం.. ప్రజలకు ఎన్నో చేశాం అని కల్లబొల్లి కబుర్లు చెప్పి మోసం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. ఇప్పుడు తన బినామీ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టి అదే ఇసుకతో వ్యాపారం చేసుకుంటున్నారు. ఇచ్చిన హామీలు 95 శాతం నెరవేర్చామని చెప్పుకొంటున్నారు. అంత కంటే దగాకోరు మాటలు ఇంకేం ఉంటాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మంది పేదలకు ఇసుక ఉచితంగా ఇచ్చారో చెప్పండి? మీ ఇసుక పాలసీల కారణంగా గత మూడేళ్లుగా పనులు లేక లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. రాష్ట్ర రహదారులు మొత్తం గుంతల మయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మూడేళ్లలో ఒక్క రహదారి అయినా బాగు చేశారా? ఎప్పటికప్పుడు వర్షాకాలం ముగియగానే రోడ్లు వేసేస్తామని ప్రకటనలతో సరిపెడుతున్నారు. ఏం విజయాలు సాధించారని మీ ఎమ్మెల్యేలను గడప గడపకు వెళ్లమన్నారు. ఇప్పటికే గ్రామాల్లో జనం మీ ఎమ్మెల్యేలను తరిమి తరిమి కొడుతున్నారు. బయటకు వస్తే ఏం అడుగుతారో తెలియక మీ ఎమ్మెల్యేలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. రాష్ట్ర ప్రజలు సీబీఐ కేసులు లేని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం ఖాయం. జనసేన పార్టీ ప్రభుత్వంలో కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రజలందరికీ సమపాలన అందిస్తాం అన్నారు.