పోలీస్ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారు

* జీత భత్యాల మీద ఆధారపడిన ఉద్యోగులను వేధిస్తున్నారు.
* రైతు కన్నీరు తుడవ లేక రగడ సృష్టిస్తున్నారు.
* వైసీపీ ప్రభుత్వ పాలనలో వైఫల్యాలు కప్పిపుచ్చడానికి ప్రజల మధ్య విభేదాలు ప్రేరేపిస్తున్నారు.
* జనసేన కోసం ఆఖరి శ్వాస వరకు జన సైనికుడిగా పని చేస్తా
* జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు

శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేస్తున్న పోలీస్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చెయ్యడం సమంజసం కాదని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. తమ సేవలకు ప్రతిఫలంగా వచ్చే జీత భత్యాల మీద ఆధారపడే ఉద్యోగులను వేధించడం మానుకోవాలని సూచించారు. రైతాంగం, ఉద్యోగులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పలు అంశాలను గురించి ప్రస్తావిస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. పోలీస్ శాఖలోని ఉద్యోగులకు గత కొన్ని నెలలుగా జీత భత్యాలు సకాలంలో అందడం లేదని తెలిసింది. సగటు పోలీస్ ఉద్యోగి కుటుంబం సభ్యుడిగా సకాలంలో జీతభత్యాలు అందకపోతే చోటు చేసుకునే సమస్యలు తెలుసునని, అవి అనుభవించాం కాబట్టే అటువంటి సమస్యలు మరొకరికి రాకూడదని ఉద్యోగస్తుల పక్షాన మాట్లాడాల్సి వస్తోందని స్పష్టతనిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన పార్టీకి రాజ్యాధికారం అప్పజెప్పాలని, పవన్ కల్యాణ్ ని ముఖ్యమంత్రిని చెయ్యాలనే భావన అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతోందని నాగబాబు పేర్కొన్నారు. జనసేన పార్టీ బలమైన నిర్మాణం కోసం తన చివరి శ్వాస వరకు జన సైనికుడిగా పని చేస్తానని స్పష్టం చేశారు. జనసేన పార్టీ నిర్మాణం కోసం రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి రావడానికైనా సిద్ధంగా ఉన్నానని, జన సైనికులు, వీర మహిళలు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని, ఏ విధమైన బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగొద్దు అని పిలుపునిచ్చారు. ఇక నుంచి నేను ప్రతీ జన సైనికుడికి, వీర మహిళకు అందుబాటులో ఉంటానని అత్యవసర సమయాల్లో అవసరం అనుకుంటే నన్ను సంప్రదించవచ్చనే ధైర్యానిచ్చారు.
* అవినీతి, అరాచకాలను కప్పిపుచ్చడానికే వైసీపీ రగడ
ప్రజా సమస్యలు, రైతాంగం కష్టాల గురించి మేము మాట్లాడుతుంటే వ్యక్తిగత జీవితాల గురించి ఆరోపణలు చేస్తున్నారు.. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్న తీరును, ప్రజా ప్రయోజన వ్యవహారాల్లో వైసీపీ ప్రభుత్వం అసమర్థతను కప్పిపుచ్చడానికే వైసీపీ మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గురించి దుర్భాషలాడుతున్నారు అన్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అవినీతి, అరాచకాల వైపు ప్రజలు దృష్టి పెడితే తమ బండారం బయట పడుతుందని ప్రజల దృష్టి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ మీదకు మరల్చే విధంగా, సీఎం, ఆయన అనుచర మంత్రి గణం చేస్తున్న ప్రయత్నాలకు సరైన సమయంలో సమాధానం చెప్తామన్నారు. తమను కాపాడుకుంటారు అని మిమ్మల్ని నమ్మి ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని స్పష్టం చేశారు. పరిపాలనలో లోటుపాట్లను పట్టించుకోకుండా కేవలం పవన్ కల్యాణ్ గారి మీద పడి మొరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. శ్రీ పవన్ కల్యాణ్ జీవితం తెరిచిన పుస్తకం అని అందరికీ తెలిసిందే.. ప్రజా జీవితం కోసం, ప్రజా చైతన్యం కోసం, ప్రజలతో మమేకమై పని చేస్తున్న పవన్ కల్యాణ్ గురించి మాట్లాడడం వైసీపీ అహంకారానికి నిదర్శనం అన్నారు. వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తే భయపడి పోతారు, అప్పుడు మనల్ని ప్రశ్నించే వారు, ఎదురించే వారే ఉండరూ అని అనుకుంటున్నారేమో.. ఆ రోజులు పొయ్యాయని నాగబాబు హితవు పలికారు.