అర్జీల పరిష్కార ప్రక్రియ తక్షణం మొదలు

•రైతాంగం, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద వర్గాల నుంచి పవన్ కళ్యాణ్ కు అర్జీలు
•సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు
•విజయవాడ మీడియా సమావేశంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ చేపట్టిన ‘జనవాణి’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధితుల నుంచి 427 అర్జీలను స్వీకరించారని తెలిపారు. స్వీకరించిన పిటిషన్లలో ఎక్కువగా వ్యవసాయ, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, హౌసింగ్, ఆరోగ్య శాఖల నుంచి వచ్చాయని వెల్లడించారు. ఆదివారం సాయంత్రం జనవాణి కార్యక్రమం అనంతరం మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “సామాన్యుల ఇబ్బందుల గురించి స్పందించాల్సిన బాధ్యత, కర్తవ్యం ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగంపై ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రి… సామాన్యుడికి అందుబాటులో లేకపోవడం చాలా బాధాకరం. జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు వేలమంది పోలీసుల పహారా, బారికేడ్ల సహాయంతో ఎవరినీ దగ్గరకు రానీయడంలేదు. నిజంగా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వారంలో ఒక రోజో, గంటో సామాన్యులకు అందుబాటులో ఉంటే చాలా వరకు సమస్యలు పరిష్కారమయ్యేవి.
•అర్జీలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడి పెంచుతాం
విజయవాడ నగరం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో అర్జీలు వచ్చాయి. విజయవాడకు చాలా దూరంలో ఉన్న విశాఖపట్నం నుంచి కూడా అర్జీలు వచ్చాయి. సమయాభావం వల్ల దాదాపు 150 పిటీషన్లు స్వీకరించలేకపోయాం. వాళ్లందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం.. వచ్చే ఆదివారం ఇదే ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తాం. దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ రోజు స్వీకరించిన అర్జీల పరిష్కార ప్రక్రియ రేపటి నుంచి పార్టీ కార్యాలయంలో మొదలవుతుంది. సమస్యల పరిష్కారం కోసం అన్ని ప్రభుత్వ శాఖలకు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా లెటర్స్ రాస్తారు. ఈ అర్జీల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడి పెంచుతాం.
•ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు
ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమం జరుగుతున్న రోజే బాలినేని వినోద్ రెడ్డి అనే కౌలు రైతు అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన భార్య శ్రీమతి అపర్ణ ప్రియ కూడా అదే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమె ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ వినోద్ రెడ్డి బిడ్డలు జనవాణి కార్యక్రమానికి వచ్చారని తెలియగానే పవన్ కళ్యాణ్ వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడం చాలా గొప్ప నిర్ణయం. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో రాజకీయాల్లో ఉన్న ఎందరికో ఆదర్శవంతంగా నిలిచారు. జనసేన పార్టీ అంటే అధికారంలోకి వస్తేనే సమస్యలపై స్పందిస్తామని కాదు. సామాన్యుడు ఎక్కడ, ఎటువంటి ఇబ్బందులకు గురైనా వాళ్లకు అండగా నిలబడతామని” అన్నారు.