ముఖ్యమంత్రి మొండి వైఖరే కౌలు రైతుల ఉసురు తీసింది

•కొత్త కౌలు చట్టం వల్లే 3 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు
•సీఎం సొంత జిల్లా ప్రజలకే భరోసా కల్పించలేకపోయారు
•వరదలు వచ్చి ఏడాది గడచినా నేటికీ సాయం అందలేదు
•రాష్ట్ర రైతాంగానికి భరోసా నింపడమే లక్ష్యంగా కౌలు రైతు భరోసా యాత్రకు శ్రీకారం
•ఈ నెల 20వ తేదీన ఉమ్మడి కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
•176 మంది కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందచేస్తారు
•కడప మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

ముఖ్యమంత్రి మొండి వైఖరితో తీసుకువచ్చిన కొత్త కౌలు సాగు చట్టమే కౌలు రైతుల ఉసురు తీసిందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. భూ యజమానుల అనుమతి ఉంటేనే లోన్లు, భూ యజమానుల అనుమతి ఉంటేనే గుర్తింపు అంటూ చేసిన మోసపూరిత చట్టం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా దక్కని పరిస్థితుల్లో కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడితే పవన్ కళ్యాణ్ వారి కుటుంబాలను ఆదుకుని, రాష్ట్ర రైతాంగానికి ఒక భరోసా నింపడమే లక్ష్యంగా, వారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కౌలు రైతు భరోసా యాత్ర తీసుకువచ్చారన్నారు. గురువారం కడపలో మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఈ నెల 20వ తేదీన ఉమ్మడి కడప జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ గారు రానున్నాను. ఉదయం 12 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా సిద్ధవటంలోని సభా ప్రాంగణానికి చేరుకుని జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన 176 కౌలు రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందచేస్తారు. రైతాంగానికి అండగా నిలబడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇప్పటికే అనంతపురం, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలోనూ పూర్తయ్యింది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మొదటి విడత కార్యక్రమం పూర్తయ్యింది. కర్నూలు జిల్లాలో మరో రెండు విడతలు కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సొంత నిధుల నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. 5 కోట్లు ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులతో సహా ఎంతో మంది ఈ కార్యక్రమానికి తమవంతు సాయం అందించారు.
•మీ పాలన అద్భుతంగా ఉంటే రైతులు ఎందుకు చనిపోతున్నారు?
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి బటన్లు నొక్కి అద్భుతంగా సంక్షేమం అందిస్తున్నామని చెబుతున్నారు. మీ పాలన అంత అద్భుతంగా ఉంటే అంత మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రూ. 6,300 కోట్లు ఖర్చు చేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏ ఒక్క కేంద్రంలో అయినా మార్కెటింగ్ సౌకర్యాలు ఉన్నాయా? ఒక్క రైతుకు అయినా ఎరువులు, విత్తనాలు ఇస్తున్నారా? రైతు భరోసా కేంద్రాలు ఉత్తి బూటకం, ఏ మాత్రం పారదర్శకత లేని పనితీరుతో రైతులకు లాభం చేకూర్చకపోగా వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టేస్తున్నాయి. శ్రీ జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 176 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఏ మాత్రం భరోసా లేని పరిస్థితులలో 46 మంది ఆత్మహత్య చేసుకోవడం వ్యవసాయంలో వచ్చిన నష్టాలు వారిని ఏ స్థాయిలో బాధించాయో అర్ధం చేసుకోవచ్చు. అప్పుల వాళ్లు వెంట పడుతుంటే తట్టుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడిన దుస్థితి ఉంది. దీనికి తోడు రైతుల్ని కులాల వారీగా విడగొట్టి ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అందరికీ రాకుండా చేశారు. ముఖ్యమంత్రి పనితీరు ఏంటో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. గతేడాది కడప జిల్లాలో వరదలు వస్తే మొట్టమొదట స్పందించింది జనసైనికులు, జనసేన నాయకులే. వరదలు వచ్చి ఏడాది గడచినా ఇప్పటికీ అక్కడ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. పశువులకు దాణా లేదు. ఇళ్లు కట్టిస్తానని ఇచ్చిన మాట ఏమయ్యిందో ముఖ్యమంత్రికే తెలియాలి. వరద సాయం కూడా కొంత మందికే ఎందుకు ఇచ్చారో చెప్పాలి. ఉదయం ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఒక మహిళ ఈ ఆత్మహత్యలు మా ప్రాంతంలో కూడా వస్తాయేమోనని వాపోతుంటే బాధ కలిగింది.
•రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే రైతు భరోసా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే రైతుల్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి కడప జిల్లాలో శనివారం 176 మంది రైతు కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయంతోపాటు వారి బిడ్డలను చదివించే బాధ్యత స్వీకరించనున్నారు. ఆ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లేందుకు జిల్లా నాయకత్వంతో కలసి ఏర్పాట్లు చేస్తున్నారు. రైతాంగానికి చక్కటి భవిష్యత్తు, భరోసా ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరి ఆశీర్వాదం అవసరం. నిజాయితీగా రాష్ట్ర ప్రజల్ని కాపాడాలన్న లక్ష్యంతో జనసేన పార్టీ ముందుకు వెళ్తుంద”ని చెప్పారు.
•ఉమ్మడి కడప జిల్లా కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం
అనంతరం ఉమ్మడి కడప జిల్లా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీ పార్టీ అధ్యక్షుల వారు పాల్గొననున్న కౌలు రైతు భరోసా యాత్ర విజయవంతానికి అవసరమైన దిశానిర్ధేశం చేశారు. ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా వ్యవహరించి సిద్ధవటంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొనే రైతులకు, మహిళలకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 176 మంది కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం చేయనున్న బృహత్తర కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. దేవుని గడపకు చెందిన వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు పంతం నానాజీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి సత్యనారాయణ, చిలకం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు తాతంశెట్టి నాగేంద్ర, ముకరం చాంద్, పార్టీ నాయకులు పీవీఎస్ఎన్ మూర్తి, పందిటి మల్హోత్రా, ఎం.వి. రావు, వివేక్ బాబు, దాశరధి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *