కౌలు రైతు కుటుంబాల యాతన అనంతం

* ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు భరోసా ఇవ్వని ప్రభుత్వం
* తెనాలి నియోజకవర్గ పర్యటనలో శ్రీ నాదెండ్ల మనోహర్ ఎదుట బాధిత మహిళ ఆక్రందన

రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా… కౌలు రైతుల బలవన్మరణాల వ్యధలు ఎదురవుతూనే ఉన్నాయి. కౌలు రైతుల కుటుంబాలు పడుతున్న యాతన గుండెను పిండేస్తూనే ఉంది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శుక్రవారం సాయంత్రం తెనాలి నియోజకవర్గం, అత్తోట గ్రామంలో పర్యటించి జనసేన నాయకులను, పార్టీ శ్రేణులను, రైతులను పలకరించారు. అత్తోట గ్రామంలో శ్రీ నారాయణో రాజగోపాలచార్యులు ఇంటికి వెళ్లి వారితో మాట్లాడుతున్న సమయంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కుంచవరం గ్రామానికి చెందిన కౌలు రైతు శ్రీ తోట శ్రీనివాసరావు భార్య శ్రీమతి అంజలీదేవి తన బిడ్డలతో కలిసి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలిశారు. ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి, జొన్న పంటలు వేసిన తన భర్తకు వరుసగా మూడు సంవత్సరాలు దిగుబడులు రాక నష్టాలు వచ్చాయని చెప్పారు. కౌలు డబ్బులు కట్టేందుకు, సాగు పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు రూ. ఏడు లక్షలు కావడంతో ఏం చేయాలో తెలియని వేదనతో 2021 మార్చిలో గడ్డి మందు తాగి తన భర్త పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పంట కోసం చేసిన అప్పులు తన భర్తను బలి తీసుకున్నాయని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తనను తన ఇద్దరు పిల్లలను అనాథలను చేసి వెళ్లిపోయాడని శ్రీ మనోహర్ గారి ఎదుట ఆమె బోరున విలపించారు. మినీ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా పని చేస్తున్న తనకు నెల వారీ ఇంటి నిర్వహణకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు ఏమైపోతుందోనంటూ ఆమె వాపోయారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు ఆమెతో మాట్లాడుతూ- ప్రభుత్వం నుంచి కౌలు రైతులు ఆత్మ హత్యకు పాల్పడితే 7 లక్షల రూపాయలు పరిహారం వస్తుందని, మీకు అది ఏమైనా అందిందా అని ఆరా తీశారు. 2021 ఆగస్టు నుంచి ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ పరిహారం కోసం తిరుగుతున్నానని, ప్రతి కార్యాలయం అధికారి తమకు సంబంధం లేదని పంపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కార్యాలయాలు తిరగలేక విసుగు పుట్టిందని ఆమె చెప్పారు. ఇవ్వాల్సిన పరిహారాన్ని సైతం అధికారులు రాకుండా చేస్తున్నారంటూ.. మీరే ఆదుకోవాలి అంటూ శ్రీ మనోహర్ గారి దగ్గర వాపోయారు. ప్రభుత్వం నుంచి తమకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదని, కౌలు రైతు చనిపోయిన తర్వాత త్రిసభ్య కమిటీ కూడా రాలేదని, కేవలం కానిస్టేబుల్ వచ్చి వెళ్ళాడని ఆమె చెప్పారు. తమ కుటుంబాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవాలని ఆమె కోరారు. జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్ర ద్వారా కచ్చితంగా ఆదుకుంటామని, చిన్నారులు కార్తికేయ, లక్ష్మీ నాగ దుర్గ చదువు బాధ్యతను తీసుకుంటామని శ్రీ మనోహర్ గారు భరోసా ఇచ్చారు. కౌలు రైతుల పరిహారం విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని, తమకు కావలసిన వారికి మాత్రమే పరిహారం ఇవ్వడం ఈ ప్రభుత్వ వ్యవహార శైలిని బయటపెడుతుందన్నారు.
* కొల్లిపర చెక్ డ్యామ్ మన ఉమ్మడి ఆశయం
‘తెనాలి నియోజకవర్గం, కొల్లిపరలో చెక్ డ్యామ్ నిర్మించాలని గతంలో ఎప్పటినుంచో అనుకున్నాం. దీనివల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని భావించాం. దీనికి గతంలో ప్రతిపాదనలు పంపినా, అది సాకారం కాలేద’ని శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. కొల్లిపర గ్రామంలో పలువురు రైతులను కలిశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ గ్రామం నుంచి ఇటీవల జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరిన శ్రీ వి.ఎస్.రామిరెడ్డి, శ్రీ చాగంటి సుబ్బారెడ్డిల ఇళ్లకు వెళ్లి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో మనోహర్ గారు మాట్లాడుతూ… “రాజకీయాలను ఎన్నికల సమయంలో చూసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం పార్టీలకు రాజకీయాలకు అతీతంగా కలిసి పని చేద్దాం. కచ్చితంగా కొల్లిపరకు అవసరమైన సాగు, తాగునీరు అందించేలా పనిచేద్దాం. స్థానిక గ్రామాభివృద్ధి అందరి ధ్యేయంగా ముందుకు వెళ్దాం. అంతా కలిసికట్టుగా పని చేస్తే, అందరూ కలిసి వస్తారు. గతంలో తలపెట్టిన సుమారు రూ. 300 కోట్ల పనులకు ఇప్పటివరకు గ్రహణం వీడ లేదు” అన్నారు. కొల్లిపర తర్వాత అత్తోటలో శ్రీ రాజగోపాలచార్యులు ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. స్థానిక శివాలయంలో వినాయకుడి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ బండారు రవికాంత్, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ బేగ్, గుంటూరు జిల్లా కార్యదర్శులు పెరికల రాంబాబు, గుంటూరు కృష్ణ మోహన్, చదలవాడ వేణుమాధవ్, పార్టీ నేతలు తోటకూర వెంకట రమణారావు, యర్రు వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *