దారంతా గుంతలమయం.. గుడ్ మార్నింగ్ సీఎం సర్ కార్యక్రమంలో నాదెండ్ల

* మండపేట నియోజక వర్గంలో #GoodMorningCMSir కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్ లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. శుక్రవారం ఆయన మండపేట నుంచి కోరుమిల్లి, కపిలేశ్వరపురం వెళ్లే రోడ్డులో #GoodMorningCMSir కార్యక్రమంలో పాల్గొని రోడ్ల దుస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అడుగుకో గొయ్యి.. గజానికో గుంత అన్నట్లు ఉన్న రోడ్డు మీద వాహనదారులు పడుతున్న ఇబ్బందులు పరిశీలించి స్వయంగా వాహనదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు గుంతలు పరిశీలిస్తున్న సమయంలోనే పలు వాహనాలు గుంతల్లో పడి ఆగిపోవడం కనిపించింది. వాటిని స్వయంగా జనసేన పార్టీ నాయకులు వెనక నుంచి తోసి బయటకు తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్ల దుస్థితిని స్వయంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు చేపట్టిన డిజిటల్ క్యాంపైన్ ట్రెండింగ్ లో దూసుకు వెళ్తోంది. పెద్ద ఎత్తున యువత #GoodMorningCMSir టాగ్ ను వినియోగించి రాష్ట్రంలోని పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తున్నారు. జూలై 15వ తేదీ కల్లా రాష్ట్రంలో ఉన్న అన్ని రోడ్లను బాగు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రికి క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించేందుకు ఈ కార్యక్రమం ఒక వారధిలా ఉపయోగపడుతుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు.
* రోడ్డుపై నడవాలంటే ప్రపంచ రికార్డు కొట్టాల్సిందే
అత్యంత అధ్వాన్నంగా ఉన్న కోరుమిల్లి – జొన్నాడ రోడ్డులో 350 మీటర్లు విస్తరించి ఉన్న భారీ గుంతలను శ్రీ మనోహర్ గారు పరిశీలించారు. రోడ్ల పై కనీసం నడవలేని పరిస్థితిలో వాహనాలు పాడు అవుతున్నాయని స్థానికులు చెప్పారు. ఒక గుంత దాటాలంటే లాంగ్ జంప్ లో ప్రపంచ రికార్డు బద్దలు కొడితే గాని నడవలేమని స్థానికులు చెప్పారు. నిత్యం గోదావరి ఒడ్డు నుంచి వెళ్తున్న తమకు రోడ్ల పరిస్థితి మరింత భయానకంగా తయారయిందని స్థానికులు వాపోయారు. డిజిటల్ క్యాంపైన్ ద్వారా అయినా సర్కారు మొద్దు నిద్ర వీడి, వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని మనోహర్ కోరారు. ఈ సందర్బంగా అటుగా వస్తున్న రాజ్ కుమార్ అనే ఆటో డ్రైవర్ తో మాట్లాడారు. రోడ్ల పరిస్థితి ఎలా ఉందని అడగగా, గుంతల్లో రోడ్లను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందని, ఆటో మొత్తం పాడైంది అని రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. వాహన మిత్ర కింద వస్తున్న డబ్బులు ఆటో బాగు చేసుకోవడానికి కూడా సరి పోవడం లేదని వాపోయాడు. ఈ సందర్బంగా స్థానిక నాయకులు రోడ్ల పరిస్థితిని టేపుతో కొలిచారు. ఒక్కో గుంత 50 మీటర్లు పైగా ఉండటం నివ్వెరపరచింది.
* లక్షల ఖర్చు మూన్నాళ్ల ముచ్చటే
కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం – కాకినాడ రోడ్డు మొత్తం గోతులతో నిండిపోవడం మనోహర్ దృష్టిలో పడింది. అడుగు లోతున ఉన్న గుంతల మధ్య వాహనదారులు పడుతున్న ఇబ్బందులు చూసి వాహనదారులకు జాగ్రత్తలు చెప్పారు. రోడ్డుకు ఇటీవలే మరమ్మతులు చేశారని, కనీసం మూడు నెలలు కూడా తిరగకుండానే మళ్లీ రోడ్డు అత్యంత కారణంగా తయారయిందని వాహనదారులు మనోహర్ ఎదుట వాపోయారు. ‘ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. గుంతల రాజ్యం’ అంటూ జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా పడిన గుంతల వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, పార్టీ నేతలు వేగుళ్ల లీలాకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, బండారు శ్రీనివాస్, కళ్యాణం శివ శ్రీనివాస్, చెరుకూరి రామారావు, సంగీత సుభాష్ తదితరులు పాల్గొన్నారు.