మూడు నెలల్లో ఇళ్లు కట్టిస్తానన్నారు.. ఏడాది గడచినా దిక్కులేదు

•ముఖ్యమంత్రి హామీ ఏడాదిగా అమలుకు నోచుకోలేదు
•జనసేన పర్యటన ఉందని హడావిడి చేశారు
•బాధితుల అకౌంట్లలోకి మాత్రం పరిహారం రాలేదు
•అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల సమావేశంలో పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రాజెక్టు కొట్టుకుపోయి ప్రమాదం జరిగి ఏడాది గడచినా పరిహారం మాత్రం ఇప్పటికీ బాధితులకు అందలేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. మూడు నెలల్లో ఇళ్లు కట్టించి తాళాలు అప్పగిస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం అన్నమయ్య ప్రాజెక్టు ప్రమాద బాధిత గ్రామాలకు చెందిన పలువురితో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “అన్నమయ్య ప్రాజెక్టు వంటి ప్రమాదం ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరిగితే 12 రోజుల తర్వాత తీరిగ్గా హెలీకాప్టర్ లో వచ్చి తిరిగి వెళ్లిపోయారు. కూలిపోయిన 464 ఇళ్లు మూడు నెలల్లోపు కట్టించి ఇస్తానని హామి ఇచ్చారు. 5 సెంట్ల భూమి.. రూ. 5 లక్షలతో ఇళ్లు నిర్మించి స్వయంగా వచ్చి తాళాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సొంత జిల్లా బిడ్డ స్పందించారు అని అంతా సంతోషించారు. ఏడాది తర్వాత వెళ్లి చూస్తే అక్కడ ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. మేము పర్యటనకు వెళ్తున్నామని తెలిసి హౌసింగ్ పీడీతో రూ. లక్ష 40 వేలు మొదటి విడతగా బాధితులకు అందించినట్టు పేపర్ ప్రకటన విడుదల చేశారు. తీరా అక్కడ బాధితుల్ని అడిగితే ఎవరి ఖాతాలో డబ్బు జమ కాలేదు. ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశామని చెప్పిన తర్వాత అందులో మొదటి విడత విడుదల చేయడానికే సంవత్సర కాలం పట్టింది.
* ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రమాదం
కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం ప్రమాదం జరిగి సంవత్సరం గడచింది. డ్యాం కూలి మూడు, నాలుగు మండలాల్లో పంట నష్టం.. ప్రాణ నష్టం ఎవరూ ఊహించని విధంగా జరిగింది. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని ఆ గ్రామస్తులకు ఎదురైన అనుభవం వల్ల తెలుస్తోంది. భారీ వర్షాలు కురుస్తాయని, చెయ్యేరు, పెన్నా నదులకు భారీ నీటి ప్రవాహం వచ్చి చేరే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం, వాతావరణ శాఖలు హెచ్చరించాయి. ఒకరిద్దరు అధికారులు స్పందించి కొంత ప్రయత్నం చేసినా రాజకీయ వ్యవస్థ దాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల అపార నష్టం సంభవించింది. 2002లో నిర్మాణం చేసిన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 44 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలు వేల సంఖ్యలో పశు సంపద కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ఎవరికీ ఆ లెక్క లేదు. చాలా అన్యాయంగా జరిగిన ఈ సంఘటన తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో.. అందరికంటే ముందుగా మా జనసేన నాయకులు ఆ గ్రామాల్లో సందర్శించారు. చీకట్లో కూడా ఆ గ్రామాలకు వెళ్లి కొంత వరకు సాయం అందించారు. నిత్యవసర సరుకులు అందచేసి వారం రోజుల వరకు సాయం చేశారు. అది చూసి ఉభయ గోదావరితోపాటు ఇతర జిల్లాల నుంచి దేశాల నుంచి మా నాయకులు స్పందించి చేతనైన సాయం చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గత నవంబర్ 21వ తేదీన ఆ ప్రాంతంలో నేను స్వయంగా సందర్శించి అక్కడ చోటు చేసుకున్న బీభత్సాన్ని చూసి ఆశ్చర్యపోయాం. ఎక్కడ చూసినా పంట నష్టం.. కూలిన ఇళ్లు. మూడు పంటలు పండే ప్రాంతం ఇసుక మేటలు వేసి ఎడారిలా మారిపోయింది. ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన కనబడడం లేదన్న భావన కలిగింది.
* సెల్ ఫోన్ లో ఛార్జింగ్ ఉన్నంత వరకు ఫోన్ చేస్తూనే ఉన్నారు
అన్నమయ్య ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రాజెక్టులో లష్కర్ గా పనిచేసిన రామయ్య గారిని కలిశాను. ప్రజల కోసం ఆయన చెప్పిన మాటలు నన్ను కదిలించాయి. అన్నమయ్య ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో అధికం కావడంతో ప్రాజెక్టు పరిస్థితి ప్రమాదంలో పడిందని గమనించిన రామయ్య గారు రాత్రి రెండు గంటల నుంచి ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తూనే ఉన్నారు. రాత్రి అంతా దాదాపు 120 ఫోన్ కాల్స్ చేశారు. డ్యాం కొట్టుకుపోయిన తరువాత ఇంటికి వెళ్లి చూస్తే మొత్తం ధ్వంసమైంది. తన కుటుంబంతో పాటు వందలాది కుటుంబాలను కాపాడిన ఆయన తన ఇంట్లో వస్తువులను మాత్రం కాపాడుకోలేకపోయారు. ప్రమాద సమయంలో కనీసం సైరన్ కూడా పని చేయలేదు. కేవలం రామయ్య గారి ఫోన్ కాల్స్ వల్లనే ప్రాణ నష్టం తగ్గింది. ప్రమాదం జరిగి ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఒక్క రూపాయి ఆర్థిక సాయం బాధితులకు అందలేదు. ఇళ్లు కట్టించి ఇస్తామన్న హామీ నెరవేర్చలేదు. బాధితులు ఇప్పటికీ టెంటులు, గుడిసెల్లో జీవిస్తున్నారు. పదవీ విరమణ తరవాత లష్కర్ రామయ్య గారు ప్రమాదానికి గురయ్యారు. పదవీ విరమణ సమయంలో వచ్చిన డబ్బులు వైద్య ఖర్చులకు సరిపోయాయి. ఒకప్పుడు ఎంతో హుందాగా బతికిన కుటుంబం ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయింది. ఆయనకు ఉన్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో ఇసుక మేటలు వేశాయి. దానికి కూడా నష్టపరిహారం అందలేదు. ఇసుక మేటలు తీయడానికి ప్రతి హెక్టారుకు రూ.12,500 నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దానిని కూడా నిలబెట్టుకోలేకపోయారు. కోనసీమలా మూడు పంటలు పండే ప్రాంతం ఇప్పుడు దీన స్థితిలో దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టు మరమ్మతులకు కోటి రూపాయలు ప్రభుత్వం వెచ్చించి ఉంటే 44 మంది ప్రాణాలను కాపాడే గలిగే వాళ్లమని రామయ్య గారు చెప్పారు.
* బాక్సింగ్ ఛాంపియన్ బస్తాలు మోస్తున్నాడు
వంశీకృష్ణ బాక్సింగ్ ఛాంపియన్. 64 గోల్డ్ మెడల్స్, 11 సిల్వర్ మెడల్స్ గెలిచాడు. ఇప్పుడు ధాన్యం బస్తాలు మోసుకునే పరిస్థితి దాపురించింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక బాక్సింగ్ వదులుకున్నాడు. గ్రామంలో కనీసం ఉపాధి లేక చెన్నై వెళ్లి ఉద్యోగం చేయాలనుకున్నాడు.. కుదరకపోవడంతో గ్రామంలోనే ధాన్యం బస్తాలు మోసుకుంటూ అమ్మ, అమ్మమ్మలతో జీవనం సాగిస్తున్నాడు. అమ్మమ్మగారికి పెన్షన్ వస్తుందని వంశీకృష్ణ తల్లికి పెన్షన్ ఇవ్వడం మానేశార”ని చెప్పారు.