హంతకులకు వంత పాడేవారిని రౌడీలు అంటారు

* శ్రీ వివేకానంద రెడ్డిని చంపిన వాళ్లకు మద్దతుగా నిలిచిన వాళ్ళే రౌడీలు
* వైసీపీ నాయకులవి ఉగ్రవాదులు మాట్లాడే మాటలు
* రాజకీయ ప్రత్యర్ధులు లేకుండా చేస్తారా?
* ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటుంది
* అన్నమయ్య ప్రాజెక్ట్ బాధితులకు అండగా ఉంటాం
* లష్కర్ శ్రీ రామయ్య లాంటి వ్యక్తులు నిజమైన హీరోలు
* జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
* అన్నమయ్య ప్రాజెక్టుకు ముప్పును గ్రహించి అప్రమత్తం చేసి ఎంతో మందిని కాపాడిన శ్రీ రామయ్యకి

శ్రీ పవన్ కళ్యాణ్ సత్కారం
‘వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపిన వారికి మద్దతునిచ్చే వారినే రౌడీ సేన అనాలి.. సొంత ఊరిలో ముఠా సంస్కృతితో చెట్లు నరికే వారిని రౌడీ సేన అంటారు. అంతేకాని అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు అండగా నిలబడిన వారిని, వందలాది మంది ప్రాణాలను విపత్తు సమయంలో కాపాడిన నిజమైన హీరో శ్రీ రామయ్య గారి లాంటి వారిని సత్కరించుకున్న మమ్మల్ని ఏమంటారో ప్రజలకు తెలుసు’ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన సమయంలో ఎంతో మందికి ఫోన్ చేసి అప్రమత్తపరచి ప్రాణాలు కాపాడిన అన్నమయ్య ప్రాజెక్టు లష్కర్ శ్రీ రామయ్య గారిని శనివారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సత్కరించారు. ఆయనతోపాటు అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన సమయంలో సర్వం కోల్పోయిన నేషనల్ బాక్సర్ శ్రీ వంశీకృష్ణ అనే యువకుడికి సాయం అందించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాయలసీమలో ప్రజల్ని భయపెట్టకుండా నామినేషన్లు వేసి పోటీ చేసే ధైర్యం వైసీపీకి లేదు. ప్రతి ఒక్కరిని బెదిరించి ఎన్నికలను, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారు. నేలపైన ఆధారపడిన రైతు ఆర్థిక మూలాలు దెబ్బ తీసేయడానికి ముఠా సంస్కృతితో చెట్లు నరికిస్తారు. మత్స్య పురాణంలో ఒక పంక్తి ఉంటుంది. పది బావులు ఒక చెరువుతో సమానం.. పది చెరువులు ఒక సరస్సుతో సమానం.. పది సరస్సులు ఒక బాలుడుతో సమానం.. పదిమంది బాలురు ఒక చెట్టుతో సమానం అంటారు. చెట్టు యొక్క గొప్ప విశిష్టత తెలుసుకోవాలంటే కచ్చితంగా ఈ వాక్యాలు గుర్తుంచుకోవాలి. ఒక చెట్టు నరికేస్తున్నారు అంటే పది మంది బిడ్డల్ని హత్య చేస్తున్నట్లే. ప్రజల్ని భయపెట్టేందుకు రైతుల తోటలను నరికే విష సంస్కృతి కలిగిన నాయకులున్నారు. రాయలసీమ అంటే అలాంటి నాయకులే కాదు ప్రజల పట్ల బాధ్యత ఉన్న లష్కర్ రామయ్య గారి లాంటి వారూ ఉన్నారు.
* వైసీపీని ఉగ్రవాద సంస్థగానే చూస్తాం
హత్యా రాజకీయాలు చేయాలనుకుంటే ఎవరిని మిగల్చం అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలను కనీసం వైసీపీ నాయకత్వం కూడా ఖండించడం లేదు. అలాంటి వారిని అలాంటి ప్రకటనలను, ఖండించకపోతే కచ్చితంగా వైసీపీని ఉగ్రవాద సంస్థగానే చూస్తాం. అలాంటి ఉగ్రవాద సంస్థకు శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గారిని ప్రధాన సలహాదారుగానే పరిగణిస్తాం. రాయలసీమ సంస్కార సీమ. చదువుల నేల. ఇక్కడ ఎంతో అద్భుతమైన వ్యక్తులు తిరిగాడారు. ఆ నేలకు కచ్చితంగా తగిన గౌరవం ఇస్తాం. రాయలసీమగాని, ఉత్తరాంధ్రలోగాని నాయకులు వెనకబడడం లేదు. కేవలం ప్రజలను మాత్రమే నాయకులు వెనకుండేలా చేస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడానికి కూడా వైసీపీ నాయకుల ఇసుక మాఫియా వాళ్ళే కారణం. ప్రాజెక్ట్ నిర్వహణ కోసం రూ.కోటి ఖర్చు చేసి ఉంటే, ఇంత ఆస్తి నష్టం, ప్రాణం నష్టం జరిగేది కాదు. దానికి ఈ ప్రభుత్వం కనీసం ముందుకు రాలేదు.
* రామయ్య ముందుచూపు అద్భుతం
అన్నమయ్య ప్రాజెక్టు పరిస్థితిని గమనించి వందలాది మందిని అప్రమత్తం చేసిన గొప్ప హీరో రామయ్య గారు. ఎంతో ఉన్నతంగా బతికిన రామయ్య గారి కుటుంబం నేడు దీనస్థితిలో ఉంది. సినిమాల్లో చూసే హీరోల కంటే నిజ జీవితంలో శ్రీ రామయ్య గారి లాంటివారే గొప్ప హీరోలు. అన్నమయ్య ప్రాజెక్టు వరదలో మొత్తం పలు గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహాయం అందలేదు. యువతలో అద్భుతమైన ప్రతిభా పాటవాలు ఉన్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు వరదల వల్ల శ్రీ వంశీ కృష్ణ లాంటి అద్భుతమైన యువత నష్ట పోయారు. జాతీయ ఛాంపియన్ అయిన వంశీ కృష్ణ కుటుంబానికి జనసేన పార్టీ మద్దతుదారులు అండగా ఉండాలని కోరుతున్నాను. ఎన్నో పతకాలు సాధించిన వంశీకృష్ణ సొంత కాళ్ళ మీద నిలబడి మార్షల్ ఆర్ట్స్ లో రాణించేలా చూస్తాం” అన్నారు. ఈ సందర్భంగా రామయ్య గారిని సత్కరించి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం, వంశీకృష్ణను సత్కరించి రూ. 50 వేల ఆర్థిక సహాయం పార్టీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ అందజేశారు.