నేరస్తుల్ని ఎదుర్కోవడానికి చట్టాలపై అవగాహన ఉన్నవారు కావాలి
• పోరాట పటిమ, విలువలున్న వారు రాజకీయాలకు అవసరం
• వైసీపీని ఓడించడం అసాధ్యమేమీ కాదు
• జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
• జనసేనలోకి కాకినాడకు చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీ తోట సుధీర్
నేరస్తులను ఎదుర్కోవాలంటే చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తుల మద్దతు అవసరం అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అధిగమించి ముందుకు వెళ్లాలన్నా చట్టాల మీద సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తులు కావాలన్నారు. రాజకీయాల్లోకి పోరాట పటిమ, విలువలు ఉన్న వారు రావాలన్నది తన ఆకాంక్ష అని అన్నారు. ప్రముఖ న్యాయవాది శ్రీ తోట సుధీర్ లాంటివారు జనసేన పార్టీలో చేరికతో అది నెరవేరిందన్నారు. కాకినాడ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, కాకినాడ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ ఛైర్మన్ శ్రీ తోట సుధీర్ శుక్రవారం భీమవరం నిర్మలా ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదు. అది అసాధ్యమేమీ కాదు. వైసీపీ జెండా ఎగరకూడదన్నది.. ఎవరెస్ట్ ఎక్కడం కంటే ఎంతో సులభం. వైసీపీ గెలవకూడదు అనడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వైసీపీ పాలనలో యువతకు ఉపాధి లేదు.. రైతులకు లాభం సంగతి పక్కన పెడితే కనీసం గిట్టుబాటు ధర దక్కడం లేదు. గిట్టుబాటు కల్పించకపోగా ప్రతి బస్తాకీ రూ.వంద చొప్పున దోచుకుంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు. సగటు యువతకు ఉపాధి, రైతుకి గిట్టుబాటు ధర లాంటివి సాధించాలంటే చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తుల సమూహం అవసరం. శ్రీ తోట సుధీర్ లాంటి వ్యక్తుల రాకతో పార్టీ బలంగా పుంజుకుంటుంది. శ్రీ సుధీర్ తో వ్యక్తిగత సాన్నిహిత్యం ఉన్నా ఎప్పుడూ రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించలేదు. వారి కుటుంబం మొత్తం మద్దతు ఇచ్చి పంపారు. ఆయనతోపాటు పార్టీలో చేరేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ 5 వేల మందిని కదిలించే శక్తి ఉంది. వచ్చే ఎన్నికల్లో కాకినాడలో జనసేన జెండా ఎగరాలి. రాజకీయాల్లో అమ్ముడుపోవడం తేలిక. నా మటుకు నాకు పుట్టిన నేల బాగుండాలి.. దేశం బాగుండాలి అన్న కోరిక తప్ప మరే కోరికా లేదు. అడ్డదారులు తొక్కకుండా నిజాయతీగా రాజకీయాలు చేయడం చాలా కష్టం. ఆ విధంగా నిలబడ్డాం కాబట్టే ఈ రోజు ప్రతి ఒక్కరూ మన వైపు వస్తున్నారు” అన్నారు.
అంతకు ముందు కాకినాడ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీ తోట సుధీర్ కి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్ తోట అనంత లక్ష్మి, డాక్టర్ తోట కావ్య, శ్రీ తోట శక్తిలతో మాట్లాడారు. వీరి వెంట వచ్చిన వారికి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ, శ్రీ ముత్తా శశిధర్, శ్రీ పితాని బాలకృష్ణ, అమలాపురం ఇంఛార్జ్ శ్రీ శెట్టిబత్తుల రాజబాబు, కాకినాడ నగర అధ్యక్షులు శ్రీ సంగిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు.