అమరవీరుల ఆశయాల సాధన కోసం పోరాడుతాం: ఆకుల సుమన్

హనుమకొండ, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల కోసం ఇంకా పోరాటాలు జరగడం శోచనీయం అని జనసేన పార్టి ఉమ్మడి వరంగల్ ఇంచార్జి ఆకుల సుమన్ ఆవేదన వ్యక్తం చేసారు మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి అని సుమన్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కార్యాలయంలో అమరవీరుడు శ్రీకాంత్ చారి 12వ వర్ధంతి సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయనకు నివాళులు అర్పించారు. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ వైఖరికి నిరసనగా ఆత్మబలిదానం చేసుకొని శ్రీకాంత్ చారి ఉద్యమానికి ఊపిరి పోశారని ఆకుల సుమన్ అన్నారు. ఉద్యమకారులు ఆత్మబలిదానాలు చేసుకుంది భౌగోళిక తెలంగాణ కోసం కాదని, బతుకు దెరువు, ఆత్మగౌరవ తెలంగాణ కోసమని పేర్కొన్నారు, ఇప్పటికీ నిరుద్యోగ సమస్య అలానే ఉందని, నీళ్ల కోసం తెలంగాణ ప్రజలు ఆరాటపడుతున్నారని అన్నారు. అమరవీరుల ఆశయాల సాధన కోసం తమ పోరాటాలను కొనసాగిస్తామని సుమన్ స్పష్టంచేశారు. శ్రీకాంత్ చారి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని శ్రీకాంత్ చారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు.