పంచగ్రామాల భూ సమస్య పరిష్కరిస్తాం

• తాత్కాలిక పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు.. ఎల్జీ పాలిమర్స్ బాధితుల ఆవేదన
• జనసేన కేంద్ర కార్యాలయంలో వినతులు స్వీకరించిన పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు

దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని పంచ గ్రామాల సమస్య కూటమి ప్రభుత్వంలో కొలిక్కి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు తెలిపారు. రెండు వారాల క్రితమే దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో సమావేశమై కీలక అంశాలపై చర్చించామని, త్వరలోనే సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఆదివారం మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజల నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. ప్రతీ ఒక్కరి సమస్యను స్వయంగా విన్న శ్రీ రమేష్ బాబు గారు అర్జీలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలు విజ్ఞప్తులపై అక్కడికక్కడే ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పరిష్కారం చేశారు.
బాధితులు చెప్పిన కొన్ని సమస్యలు ఇవి…
• ఎల్జీ పాలిమర్స్ ప్రమాద సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అప్పుడు తాత్కాలిక పరిహారం ఇచ్చి.. చేతులు దులుపుకొందని వాపోయారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో సూపర్ స్పెషాలిటి హాస్పిటల్‌తోపాటు…ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి జగన్, ఇతర మంత్రులు చాలామందే చెప్పారని, ఇప్పటికీ నాలుగున్నరేళ్లు అవుతున్నా ఆసుపత్రి నిర్మాణం జరగలేదని వాపోయారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు ఎప్పటికప్పుడు ఆరోగ్య శిబిరాలు నిర్వహించి బాధితుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి. బాధితులపై నమోదు చేసిన కేసులు ఉపసంహరించుకోవాలి. బాధిత గ్రామాలలో భూగర్భ జలాలు రంగుమారి కనిపిస్తున్నాయి. స్టైరీన్‌ విషవాయువులు వెలువడిన తరువాత భూగర్భం నుంచి వచ్చే నీరు మరింత ముదురు రంగులోకి మారింది. ఆ నీరు ఉపయోగించడానికి వీలులేకుండా ఉందని, సురక్షితమైన తాగునీరు అందించే ఏర్పాటు చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
• విశాఖపట్నంలోని సింహాచలం ఆలయ భూములకు సంబంధించిన పంచగ్రామాల సమస్యతో 25 ఏళ్లుగా విసిగిపోయామని, కూటమి ప్రభుత్వంలోనైనా సమస్య కొలిక్కి తీసుకొచ్చి తమకు తగిన న్యాయం చేయాలని పంచగ్రామాల్లో ఒకటైన వెంకటాపురం గ్రామస్థులు అర్జీ ఇచ్చారు. తరతరాలుగా అక్కడే ఉండి భూములు సాగు చేసుకొని, శిస్తు కడుతున్నా వాటిపై హక్కు మాత్రం తమకు లేదని వాపోయారు. ఇళ్లు నిర్మించుకుందామన్నా, కనీసం రిపేరు చేయించుకోవాలన్నా అధికారులు అడ్డుకునే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు పంచగ్రామాల భూ సమస్య కొలిక్కి తెచ్చే దిశగా అడుగులు పడ్డాయని, దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. త్వరలోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
• 30 ఏళ్లుగా తమ సాగులో ఉన్న భూమిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కాజేయాలని కొంత మంది పెద్దలు చూస్తున్నారని అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట గ్రామానికి చెందిన రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీ రమేష్ బాబు గారు హామీ ఇచ్చారు.
• ‘నా భర్త శివాజీ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వై.ఎస్.ఆర్ బీమా కోసం సచివాలయ సిబ్బంది ద్వారా దరఖాస్తు చేసుకున్నాం. రూ.5 లక్షలు వరకు వస్తుందని చెప్పారు. అదిగోఇదిగో అంటున్నారే తప్ప తమకు బీమా మొత్తం అందలేదు. నిరీక్షణ తప్ప ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియద’ని అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామానికి చెందిన శ్రీమతి కాగిత వాణిశ్రీ సుబ్రహ్మణ్యేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. వితంతు పింఛనుకు దరఖాస్తు చేసుకుంటే ఫ్యామిలీ మెంబర్ మ్యాపింగ్ లో సమస్య ఉందని చెప్పి పెన్షన్ మంజూరు చేయలేదని కన్నీరు పెట్టుకుంది.
•’మాది మధ్యతరగతి కుటుంబం. నాన్నగారు ఈ ఏడాది జనవరిలో మరణించారు. నన్ను, మా అక్కలను మా అమ్మగారే సాకుతున్నారు. ఇంజనీరింగ్ చదువుకోవాలని ఉన్నా ఆర్థిక స్థోమత సహకరించక ఇబ్బంది పడుతున్నానని అనకాపల్లి జిల్లా మాకవరపాలెం గ్రామానికి శ్రీ చుక్కల ప్రసాద్ అనే యువకుడు జనసేన కేంద్ర కార్యాలయానికి అర్జీ సమర్పించాడు. ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి ఆర్థిక సహకారం అందించాలని కోరాడు. దీనిపై స్పందించిన శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు దాడి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి చదువుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీ తలాటం సత్య, శ్రీమతి రావి రమ, పార్టీ లీగల్ సెల్ నాయకులు శ్రీ అశోక్ కుమార్ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.