అమలాపురం ఘటనను ప్రేరేపించింది వైసిపినే: రామదాస్ చౌదరి

మదనపల్లె: కులాల మద్య చిచ్చు పెట్టడానికే వైసిపి ప్రభుత్వం అమలాపురం ఘటనను ప్రేరేపించిందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి ఆరోపించారు. రాయలసీమ జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్ నందు రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, అడపా సురేంద్ర, తోట కల్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి, రెడ్డెమ్మ, నవీన్, లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాల పేర్లు మార్చడం నిరంతర ప్రక్రియ అని చెప్పారని, అందువల్లే తాము ఈ ప్రతిపాదన చేస్తున్నామన్నారు. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలని జనసేన ఎప్పుడో వినతిపత్రం ఇచ్చిందని, అటువంటి పార్టీ అల్లర్ల వెనుక ఉందని నింద వేయడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. కోనసీమలో జనసేన ప్రాబల్యాన్ని దెబ్బతీయడానికే అల్లర్లు సృష్టించి తమపై నెడుతున్నారని ఆరోపించారు. వైసీపీకి దళితులు, కాపులు, బీసీలు దూరమవుతున్నారని, ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు కుల చిచ్చురేపి అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పులివెందుల కేంద్రంగా భీమ్‌రావ్ పేరిట జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ పేరును వివాదంలోకి లాగి ఆయన ఖ్యాతిని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కోనసీమలో అల్లర్లకు వైసీపీ ప్రభుత్వ పధకమే అన్నారు.