వైసీపీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు

* వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరు పోరాటం చేయాలి
* ఇప్పటం బాధితులకు ఈ నెల 27న రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందచేయనున్న శ్రీ పవన్ కళ్యాణ్
* విజయనగరంలో మీడియా సమావేశంలో మాట్లాడిన జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో వైసీపీ దాష్టీకం వల్ల ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 27న రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో జనసేన పార్టీ ముందుంటుందని అన్నారు. మంగళవారం సాయంత్రం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “విజయనగరం జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. జూట్ మిల్లులు మూతపడటంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. జిల్లాలో ఏకైక సహకార చక్కెర పరిశ్రమ భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ ఆధునికీకరణ పేరుతో ప్రభుత్వం గత రెండేళ్లుగా మూసేసింది. ఏళ్లు గడుస్తున్నా తోటపల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారు. ప్రకృతి వనరులను కొన్ని కుటుంబాలు దోచుకొని రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగిస్తున్నాయి. వీటన్నింటిపై ఈ ఐదు రోజులుపాటు చర్చిస్తాం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తాం. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారిగా ఈ సమీక్ష నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాడే విధంగా కార్యచరణ సిద్ధం చేస్తాం. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే జనసైనికులు, వీరమహిళలకు సమీక్షలో పెద్దపీట వేస్తాం.
* 7 లక్షల ఇళ్లు ఏమయ్యాయి?
విజయనగరం జిల్లా గుంకలాంలో- రాష్ట్రంలోనే అతి పెద్ద జగనన్న కాలనీ నిర్మిస్తున్నామని వైసీపీ నాయకులు ఊదరగొట్టారు. ఒకే చోట 12,500 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకొన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత వారం ఇక్కడ పర్యటిస్తే కానీ ప్రజలకు అసలు నిజం తెలిసి రాలేదు. వేల సంఖ్యలో ఇళ్లు అని చెప్పారు. వందల సంఖ్యలో కూడా ఇక్కడ కనిపించలేదు. భూ సేకరణలో అవినీతి, ఇళ్ల నిర్మాణంలో అవినీతి మాత్రం కనిపిస్తున్నాయి. లబ్ధిదారులను బెదిరించి కాంట్రాక్టులు కూడా వైసీపీ నాయకులే తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీల్లో రూ.లక్ష కోట్లతో నిర్మాణం చేస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. భూసేకరణ కోసం రూ. 22,500 కోట్లు వెచ్చించామని వెల్లడించారు. మొదట్లో 28.10 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని ఊదరగొట్టిన పెద్ద మనషులు… తరువాత దానిని సవరించి 21 లక్షల కు తగ్గించారు. మిగిలిన 7 లక్షల ఇళ్లు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలి.
* జగన్ రెడ్డి చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలుసు
ప్రజాసమస్యలపై జనసేన పార్టీ చేస్తున్న పోరాటాలు చూసి తట్టుకోలేక ముఖ్యమంత్రి జనసేన కాదు రౌడీసేన అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. వైసీపీ గెలిచాక పవన్ కళ్యాణ్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజా తీర్పును గౌరవించి ఒక ఏడాది పాటు వైసీపీని విమర్శించమని చెప్పారు. నిర్మాణాత్మక సలహాలు మాత్రం ఇస్తామని వెల్లడించారు. అలాంటి ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి పెట్టిన పార్టీ జనసేన పార్టీ. జగన్ చరిత్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి జనసేన పార్టీని విమర్శించడం హాస్యాస్పదం. శ్రీ జగన్ రెడ్డి అసమర్ధ పాలనతో రాష్ట్రంలో ప్రతి రంగాన్ని నాశనం చేశారు. ఆర్థిక రంగం కుదేలైంది. మహిళలకు భద్రత లేదు. యువతకు ఉపాధి అవకాశాలు లేవు. పారిశ్రామిక రంగం కుంటుపడింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందులలో 46 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇసుక మాఫియా ఆగడాలతో అన్నమయ్య డ్యాం ప్రమాదం జరిగి 44 మంది మృత్యువాతపడ్డారు. మూడు నెలల్లో బాధితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి.. ఏడాది అయినా పట్టించుకున్న పాపాన పోలేదు. విజయనగరం జిల్లాలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. రాష్ట్రం సర్వనాశనం అవుతుంటే వాళ్ల అనుభవం ఏమైంది? మన ప్రాంతానికి మనం ఏం చేసుకోలేమా అని ప్రశ్నించుకోకుంటే… జనసేన పార్టీ తప్పక ప్రశ్నిస్తుంది. సామాన్యుడి గొంతును వినిపించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. విజయనగరం జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి అంచెలంచెలుగా కార్యచరణ సిద్ధం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మండల, జిల్లా కమిటీలు వేస్తాం. నియోజకవర్గ ఇంఛార్జిలు త్వరలోనే నియమిస్తామని” అన్నారు. నాదెండ్ల మనోహర్ గారికి పార్టీ నేతలు, వీర మహిళలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీమతి పాలవలస యశస్వి, శ్రీ గిరడా అప్పలస్వామి, శ్రీమతి తుమ్మి లక్ష్మీ రాజ్, బాబు పాలూరి, మర్రాపు సురేష్, వబ్బిన సత్యనారాయణ, శ్రీమతి లోకం మాధవి, ఆదాడ మోహనరావు, రౌతు సతీష్, మిడతాన రవి, యోగేష్ తదితరులు పాల్గొన్నారు.