• ప్రతి వారం సమీక్ష చేపట్టాలి… క్షేత్ర స్థాయిలో పురోగతిని పరిశీలించాలి
• శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
• ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, మౌలిక వసతుల కల్పన విషయంలో చురుగ్గా వ్యవహరించాలని అధికారులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో చేపడుతున్న రహదారి పనులు, ఉపాధి హామీ కార్యక్రమాల అమలుపై పురోగతి నివేదికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని గ్రామాలు, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో తాగు నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ వేసవి సమయంలో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయాలు ఉండకూడదని, సమ్మర్ స్టోరేజి ట్యాంక్స్ దగ్గర తనిఖీలు చేయాలని సూచించారు.
పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పాడా) డైరెక్టర్ గురువారం పర్యటించి అభివృద్ధి పనులపై సమీక్షించారు. తమ పర్యటన వివరాలను ఉప ముఖ్యమంత్రికి తెలియచేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు అంశాలను సమీక్షించి దిశానిర్దేశం చేశారు. “నియోజకవర్గం అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా నిధులు సమకూరుస్తున్నాము. వాటిని సద్వినియోగం చేసి ప్రజలకు మేలు చేసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి. ప్రతి వారం ఈ పనులపై సమీక్ష చేపడతాను. అధికారులు క్షేత్ర స్థాయి పురోగతిని నిశితంగా పరిశీలించాలి. పనుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయబోతున్నాము. నా కార్యాలయ దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ పని చేస్తోంది. విద్యుత్ అంతరాయ సమస్య ఉందని తెలియగానే టిడ్కో గృహాల దగ్గర రూ.3 కోట్లతో 5 ఎం.వి.ఎ సామర్థ్యంతో కొత్త సబ్ స్టేషన్ పనులు చేపట్టాము. అమృత్ 2.0 ద్వారా పిఠాపురం పట్టణంలో తాగు నీటి సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే పురపాలక శాఖ అధికారులతో సమీక్ష చేశాము. పిఠాపురం – ఉప్పాడ రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగలిగాము. రూ.59.7 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఉపాధి హామీ పథకంలో రూ.40.2 కోట్లతో 444 రోడ్డు పనులు చేపట్టాము. అదే విధంగా 431 గోకులాలు పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చాము. పిఠాపురంలో ప్రభుత్వ ఆసుపత్రిని సి.హెచ్.సి. నుంచి ఏరియా ఆసుపత్రి స్థాయికి పెంచాము. అందుకు అనుగుణంగా రూ.38.32 కోట్లు నిధులు వచ్చాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ ఏ విధంగా చూపుతుందో తెలిపేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూరుస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో వాటిని సద్వినియోగపరుస్తున్నాము. ఈ క్రమంలో అధికారులు, ఉద్యోగులు సానుకూల దృక్పథంతో పని చేస్తే సత్ఫలితాలు వస్తాయి” అన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో శాంతిభద్రతల అంశంపై అధికారులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చర్చించారు. పిఠాపురం నియోజక వర్గ పరిధిలో పోలీసింగ్ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఉటంకిస్తూ, నాలుగు పోలీస్ స్టేషన్లలో ఉన్న పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవినీతికి పాల్పడుతున్న పోలీసు అధికారుల మూలంగా శాఖ చులకన అవుతోందన్నారు. ప్రజలను ఇబ్బందిపెట్టే నేరస్తులనే కాదు, వారికి అండగా ఉండే నాయకులను, పోలీసులను కూడా ఉపేక్షించకూడదన్నారు. తన దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను వివరించి వాటిని సత్వరమే జిల్లా పోలీసు అధికారులకు తెలియచేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల అంశంపై సంబంధిత విభాగం ఉన్నతాధికారులు, రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.
Share this content:
Post Comment