• ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో బ్రాంకోస్కోపీ చేస్తున్నారు
• ప్రమాదంలో చిన్నారి మృతి చెందడం, 30 మంది చిన్నారులు గాయపడడం కలచివేసింది
• ప్రాణాలకు తెగించి చిన్నారులను కాపాడిన భవన నిర్మాణ కార్మికులకు కృతజ్ఞతలు
• కష్టకాలంలో అండగా నిలచిన ప్రధాని మోదీకి, సీఎం చంద్రబాబుతోపాటు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
• హైదరాబాద్ లో మీడియాతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
‘సింగపూర్ లో వేసవి శిక్షణ తరగతులకు వెళ్ళిన నా రెండవ కుమారుడు మార్క్ శంకర్– అక్కడ తరగతి గదిలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడ’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం సింగపూర్ లో ఈ అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుందన్నారు. అరకు పర్యటనలో గిరిజన గ్రామాల సందర్శనకు వెళ్ళిన సమయంలో మంగళవారం ఉదయం నాకు ఫోన్ కాల్ వచ్చింది. అగ్నిప్రమాదం జరిగిన విషయాన్ని నా భార్య శ్రీమతి అన్నా తెలిపారని చెప్పారు. ప్రమాదం చిన్నదే అని మొదట భావించానని, అయితే ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందడంతో పాటు 30 మంది గాయాల పాలవ్వడం తీవ్రంగా కలచి వేసిందన్నారు. చిన్నారి మార్క్ శంకర్ కి కూడా చేతులు, కాళ్లపైన గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదంలో దట్టమైన పొగ పీల్చడంతో ఊపిరితిత్తులలోకి పొగ చేరినట్టు వైద్యులు ధృవీకరించినట్టు చెప్పారు. దీని నిమిత్తం ప్రస్తుతం బ్రాంకోస్కోపీ జరుగుతోందని, ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని తన నివాసం వద్ద మీడియాతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ “ప్రమాదం జరిగిన విషయాన్ని మొదట గుర్తించి పిల్లలను కాపాడిన భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు. వెంటనే స్పందించి చాలా మంది పిల్లల ప్రాణాలను వారు కాపాడగలిగారు. పిల్లలు తరగతి గదులకు వెళ్లి సురక్షితంగా తిరిగి వస్తారని తల్లిదండ్రులు ఎదురుచూస్తూ ఉంటాం. ఇలాంటి బాధాకరమైన వార్తలు వినాల్సి వచ్చినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఏడేళ్ల మార్క్ శంకర్ కు ప్రమాదంలో చిన్న గాయాలు అయినప్పటికీ ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో అది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందడం విచారకరం. వారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ రోజు నా పెద్ద కుమారుడు అకీరానందన్ పుట్టిన రోజు. దురదృష్టవశాత్తు ఈ రోజు నా చిన్న కుమారుడికి గాయాలు అవడం బాధాకరం. విషయం తెలిసిన వెంటనే ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడి మార్క్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. వెంటనే సింగపూర్ లో తగు వైద్య ఏర్పాట్లు చేయాలని భారత హై కమిషనర్ కి ఆదేశాలిచ్చారు. శ్రీ మోదీ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అరకులో ఉండగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరం అయిన సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆపద సమయంలో వెంటనే స్పందించి నిండు మనసుతో మార్క్ శంకర్ బాగుండాలని అభిలషించిన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, శ్రీ కిషన్ రెడ్డి గారికి, శ్రీ బండి సంజయ్ గారికి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి గారికి, రాష్ట్ర ఉససభాపతి శ్రీ రఘురామ కృష్ణంరాజు గారికి, రాష్ట్ర మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, శ్రీమతి అనిత గారికి, శ్రీ కింజారపు అచ్చన్నాయుడు గారికి, శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, శ్రీ దుర్గేష్ గారికి, తెలంగాణ మాజీ మంత్రి శ్రీ కేటీఆర్ గారికి, శ్రీ హరీష్ రావు గారికి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, సహచర సినీ నటులు, సినీ ప్రముఖులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ నేతలు, శ్రేణులు మార్క్ త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు. ఈ రోజు రాత్రికి కుమారుడి వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాను. తిరిగి వచ్చిన అనంతరం గిరిజన ప్రాంతాల్లో మిగిలిన పర్యటన పూర్తి చేస్తాను” అని చెప్పారు.

Share this content:
Post Comment