రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించిన పార్టీ జనసేన

• అంచెలంచెలుగా పార్టీ ఎదిగిన తీరు అనిర్వచనీయం
• శ్రీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పోరాటాలు చేశాం
• ప్రజా ఉద్యమాలతో ప్రజల మనసు గెలుచుకున్నాం
• నవ శక నిర్మాణానికి పునరంకితమవుతాం
• జయకేతనం ఆవిర్భావ సభలో జనసేన పార్టీ ప్రజాప్రతినిధులు

రాష్ట్ర రాజకీయాల్లో నూతన ఒరవడి తెచ్చిన పార్టీ జనసేన. పేద వాడి కంట కన్నీరు తుడిచేందుకు పుట్టిన పార్టీ జనసేన. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్ఫూర్తితో పోరాటాలు చేశాం. జనం కోసమే జనసేన అని చాటాం. బంగారు భవిష్యత్ లక్ష్యంగా నవశక నిర్మాణానికి కష్టపడి పని చేద్దాం అని జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజా సేవలో పునరంకితం అవుదామన్నారు. కూటమి భాగస్వామ్య పక్షంగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరు చేతులు కలపాలని, యువత బంగారు భవిత కోసం పని చేస్తామని హామీ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరిగిన 12వ ఆవిర్భావ సభ జయకేతనం వేదిక నుంచి అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. పిఠాపురం ఆడపడుచులు సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి సభకు శ్రీకారం చుట్టారు. కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సభకు స్వాగతం పలికారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు శ్రీ కోన తాతారావు సభను నిర్వహించారు.
• సామాన్యుడిని అందలం ఎక్కించిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్: శ్రీ కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి
జయకేతనం సభను ఉద్దేశించి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ “పేదవాడి కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా రాజకీయాలు ప్రారంభించిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ఒరవడి సృష్టించిన నాయకుడు. రాజకీయాలు అధికారం కోసం కాదు.. సామాన్యుడిని అందలం ఎక్కించడానికన్న ఆలోచనకు పదును పెట్టిన నాయకుడు. 11 ఏళ్ల పోరాటంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడంతోపాటు ప్రపంచ రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎత్తిన జెండా దించకూడదన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయవాదం, సమయోచిత నిర్ణయాలు, అలుపెరుగని పోరాటం ఆయన్ను జాతీయ స్థాయిలో అద్భుత నాయకుడిగా నిలబెట్టాయి. 11 ఏళ్ల పాటు నిర్విరామంగా సాగిన పోరాటం. వెన్ను చూపని ప్రయాణం మాకు స్ఫూర్తి. ఈ రోజున మేమంతా శాసన సభ్యులుగా ఎన్నికైనా, మంత్రిగా మీ ఎదుట నిలబడినా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా మీదున్న వాత్సల్యమే కారణం. అధికారం చేతికి వచ్చాక విర్ర వీగే ప్రభుత్వాలను, నోటికి వచ్చినట్టు మాట్లాడే దుర్మార్గులను చూశాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అప్పుడు ఇప్పుడూ నిరంతరం ఒకటే ఆలోచన కలిగిన వ్యక్తి. ప్రజలకు చేరువగా వెళ్లడం.. ప్రజా సమస్యలు తీర్చడం. అలాంటి నాయకుడి గురించి అరిచే వ్యక్తులను పట్టించుకోనవసరం లేదు. ప్రపంచ చరిత్రలో 100 శాతం స్ట్రయిక్ రేట్ సాధించి రికార్డు సృష్టించిన నాయకుడు ఆయన. అలాంటి నాయకుడి దార్శనికతలో పార్టీని బలోపేతం చేసుకుంటూ.. మంచి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తూ.. ప్రజా సేవలో పునరంకితమవుదాం” అని అన్నారు.
• శ్రీ పవన్ కళ్యాణ్ వల్ల దేశం మొత్తానికి మంచి జరిగింది : శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ పార్లమెంటు సభ్యులు
కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ… “సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి అందరిలాగే రాజకీయాలను దూరం నుంచి చూసే వ్యక్తికి పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పార్లమెంటుకి పంపడమే కాదు.. సభలో ఏం మాట్లాడాలి? ఎంత బాధ్యతతో పని చేయాలి అన్న విషయాలపై ఎప్పటికప్పుడు సూచనలిస్తారు. గత ప్రభుత్వం జల్ జీవన్ నిధులు ఖర్చు చేయకుండా మురిగిపోయే స్థితికి తెస్తే, శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కేంద్ర పెద్దలతో మాట్లాడి స్కీముని పొడిగించేలా చేశారు. ఆయన వల్ల దేశం మొత్తానికి మంచి జరిగింది. అని అన్నారు.
• సౌత్ ఇండియా మోదీ శ్రీ పవన్ కళ్యాణ్: శ్రీ పంతం నానాజీ, కాకినాడ రూరల్ శాసనసభ్యులు
కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పంతం నానాజీ మాట్లాడుతూ.. “గతం, వర్తమానం, భవిష్యత్తు మూడింటినీ ఆలోచించి ముందుకు తీసుకువెళ్లే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. 2019లో ఓటమి తర్వాత డీలా పడిపోతారనుకుంటే… ఈ ప్రస్థానం 25 ఏళ్లు అని ధైర్యం చెప్పారు. ఐదేళ్ల పాటు మాతో నిర్విరామంగా పోరాటాలు చేయించారు. సమస్య వస్తే తక్షణం స్పందించి, నేడు మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చారు. ఎన్నికల తర్వాత ఆయన 100 రెట్లు పెరిగారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్థాయికి తగ్గట్టు పార్టీని పెంచుకుంటూ వెళ్లాలి. దేశంలో గౌరవ ప్రధాని శ్రీ మోదీ గారి తర్వాత అంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడు ఆయన. ఇప్పటికే చాలా మంది ఆయన్ను సౌత్ ఇండియా మోదీగా అభివర్ణిస్తున్నారు. పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగానే ఉన్నాయి. ఈ సభ నాటికి 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలతోపాటు ఎంతో మంది ప్రజా ప్రతినిధులను ఆయన తయారు చేశారు. రానున్న రోజుల్లో ఈ వేదిక మీద మరింత మంది ఆశీనులు కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
• మా మన్యం వీరుడు శ్రీ పవన్ కళ్యాణ్: శ్రీ నిమ్మక జయకృష్ణ, పాలకొండ శాసన సభ్యులు
స్వతంత్ర పోరాట కాలంలో గిరిపుత్రులకు అండగా నిలిచిన మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామారాజు అయితే.. అదే గిరిజన ప్రాంతాల్లో పర్యటించి మా గిరిపుత్రుల కష్టాలు తీర్చిన మా మన్యం వీరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. డోలీ మోతల నుంచి విముక్తి కలిగించిన వ్యక్తి. రహదారి సౌకర్యాలు లేని గ్రామాలకు రహదారులు వేయించారు. తాగునీటి కష్టాలు తీర్చారు. నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ అన్న వ్యక్తి- మాస్కు లేదని ప్రశ్నించినందుకు డాక్టర్ సుధాకర్ ని చంపేశారు. అప్పు తీసుకున్న పాపానికి గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించారు. నడి రోడ్డుపై గిరిజన మహిళ పురుడు పోసుకోవడం గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. గత ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురైతే- శ్రీ పవన్ కళ్యాణ్ గారు నరేగా నిధులతో రోడ్ల సదుపాయం కలిపించారు. మా గిరిపుత్రులంతా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాం. మా ప్రాంతాల అభివృద్ధిపై మరింత శ్రద్ద పెట్టాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను” అన్నారు.
• పోరాటాలు చేశాం.. ప్రజల కోసం నిలబడ్డాం.. నవశకాన్ని నిర్మిద్దాం : శ్రీమతి లోకం మాధవి, నెల్లిమర్ల శాసన సభ్యురాలు
నెల్లిమర్ల శాసన సభ్యురాలు శ్రీమతి లోకం మాధవి మాట్లాడుతూ “రాష్ట్రంలోనే మొదటి సీటు నాకు ఇచ్చి వీర మహిళలకు జనసేన ఎంత గౌరవం ఇస్తుందో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రుజువు చేశారు. సీటు ఇవ్వడంతో పాటు అఖండ మెజారిటీతో విజయం సాధించే వరకు మా వెన్నంటి ఉండి మాకు చేయూత ఇచ్చిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు హృదయ పూర్వక ధన్యవాదాలు. అవమానాలు, అరెస్టులు, వ్యక్తిగత అవహేళనలు పడి ముందుకు వచ్చాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపే శిరోధార్యంగా అన్ని వర్గాలకు అండగా నిలిచాం. ప్రజల కోసం నిలబడి.. ప్రజల కోసమే జనసేన అని చాటాం.. ఇక మీదట నవశక నిర్మాణానికి కష్టపడి పని చేయాలి” అన్నారు.
• సమకాలీన రాజకీయాల్లో స్వార్ధం లేని రాజకీయ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్: శ్రీ కొణతాల రామకృష్ణ, అనకాపల్లి శాసనసభ్యులు
అనకాపల్లి శాసన సభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. “కారణ జన్ముడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. గత ఎన్నికల్లో ఒంటిచేత్తో కురుక్షేత్ర సంగ్రామం నడిపించారు. కూటమి లేకపోతే అధికారం లేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కూటమి లేదు. కూటమి ఏర్పడితేనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో మూడు పార్టీలను కలిపిన మహనీయుడు. శ్రీ మోదీ గారు నా చెంత పవన్ ఉన్నారు అని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా శ్రీ పవన్ కళ్యాణ్ గారి చెంతన ఉన్నారని నిరూపించారు. సమకాలీన రాజకీయాల్లో స్వార్ధం లేని రాజకీయాలు చేసే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సకల సౌఖ్యాలు ఇచ్చే సినిమాలు వదిలి, స్వప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా నిర్విరామంగా పోరాటం చేశాం. పోలవరం, స్టీల్ ప్లాంట్, సుజల స్రవంతి, రైల్వే జోన్ ఏర్పాటు లాంటి అంశాల్లో ఎన్నికల ముందు నేనున్నానని చెప్పారు. ఎన్నికలు అయిన ఎనిమిది నెలల్లోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపారు. కేంద్రం నుంచి ఆయన ఏమీ ఆశించరు. అందుకే ఆయన ఏం అడిగినా కేంద్రం కాదనదు. ఆయనకు పదవి అవసరం లేదు. ప్రజా క్షేమమే కావాలి. అలాంటి నిస్వార్ధ నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు.
• ఒక వ్యక్తి కష్టం.. ప్రజలకు ఆయన మీదున్న నమ్మకంతో గెలిచాం: శ్రీ పంచకర్ల రమేష్ బాబు, పెందుర్తి శాసన సభ్యులు
పెందుర్తి శాసన సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ.. ‘ఒక వ్యక్తి కష్టం. ఆయన మీద ప్రజలకున్న నమ్మకంతో మేమంతా ఎమ్మెల్యేలుగా గెలిచాం. ప్రతి ఇంట్లో కొడుకు మాదిరి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటాలు గుండెల్లో పెట్టుకుని ప్రజలు తోడుండి నడిపించారు. 21కి 21 మంది గెలవడం మా గొప్ప కాదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి కష్టం. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ప్రభుత్వ ప్రతిష్ట పెంచారు. ఇప్పటికీ ప్రజా సమస్యలపై స్పందిస్తూనే ఉన్నారు. రాజకీయాలు పదవుల కోసం కాదు ప్రజల అవసరాలు తీర్చడానికి అన్న ఆయన మాటలు పాటిస్తూ ముందుకు వెళ్తాం” అన్నారు.
పిఠాపురం ప్రజల కష్టాన్ని మరువం: శ్రీ శంకర్ గౌడ్, జనసేన పార్టీ తెలంగాణ ఇంఛార్జ్
జనసేన పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ శ్రీ శంకర్ గౌడ్ మాట్లాడుతూ “పిఠాపురం ప్రజల కష్టం నేడు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తోంది. మీ కష్టాన్ని మరువం. జనసేన పార్టీ తెలంగాణలో పుట్టినా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిపథంలో దూసుకుపోతుంది. ఎన్నో కష్టనష్టాలకోర్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోనూ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాము. శ్రీ పవన్ కళ్యాణ్ గారి కోసం యువరక్తం ఎదురు చూస్తోంది. కొంత సమయం మాకు కేటాయిస్తే అక్కడా ఇలాంటి విజయోత్సవ సభ నిర్వహించుకుంటాం అని అన్నారు.
మా ఆస్తులు జగన్ కాజేశాడు : శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి
మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. బాలినేని వైసీపీని వీడతాడంటే ఎవరూ నమ్మలేదు. అందుకు కారణం ఉంది. నాకు జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టాడు. నాకు వైఎస్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరూ ఇష్టం. జగన్ తండ్రి రాజకీయ భిక్ష పెట్టారని నాలుగేళ్ల పదవీ కాలం వదులుకుని అతని వెంట నడిచా. అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇచ్చి తీసేశాడు. నాడు తన గురించి మాట్లాడాడని శ్రీ రఘురామ కృష్ణంరాజుని కొట్టించాడు. నేడు పోసానిని జైలుకి వెళ్లి పరామర్శిస్తాడు. శ్రీ చంద్రబాబు గారి భార్య గురించి, శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి మాట్లాడితే బాధ ఉండదా? చేసిన దుర్మార్గాలు ఎక్కడికీ పోవు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు గౌరవించిన రోజునే జనసేనలో చేరి ఉండాల్సింది. బాలినేని జనసేనలో చేరి కూటమిని విడగొడతాడు అని కొన్ని పత్రికలు రాశాయి. నా వల్ల శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఇబ్బంది కలగదు. నా వల్ల ఆయన ఎదగాలని కోరుకునే ఏ పదవి అడగలేదు. పార్టీలో చేరినప్పుడు కేవలం మీతో సినిమా చేయాలని మాత్రమే అడిగాను. అందుకు ఆయన ఒప్పుకున్నారు. ఆ కోరిక తీరితే చాలు. నాకు ప్రాణం ఉన్నంత వరకు పదవి ఉన్నా లేకున్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటా.. రాజకీయాల్లో మా తండ్రి గారు ఇచ్చిన ఆస్తిలో సగం అమ్ముకున్నాను. జగన్ మా ఆస్తులు, మా వియ్యంకుడికి ఉన్నవి కూడా కాజేశాడు. నాతో సహా గత ప్రభుత్వంలో పని చేసిన ఎమ్మెల్యేలందరిపైనా విచారణ జరపాలి” అన్నారు.
కాకినాడ అర్బన్ డెవలప్ మెంట్ అధారీటి ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ “జనసేన పార్టీ జరుపుకొన్న 11 ఆవిర్భావ దినోత్సవాలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసింది. 12వ ఆవిర్భావ సభతో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైపోవడం ఖాయం” అన్నారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ మాట్లాడుతూ.. “ఎన్నో అడ్డంకులు సవాళ్ల మధ్య 11 ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకున్నాం. ఈ రోజున ఉత్సవం జరుపుకొంటున్నాం. మనమంతా ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయవలసి ఉంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనా విధానం, సిద్ధాంతాలను ఆచరిస్తూ మనమంతా లక్ష్యాన్ని చేరదాం” అన్నారు. పౌర సరఫరాల శాఖ కార్పోరేషన్ డైరెక్టర్ శ్రీమతి కడలి ఈశ్వరి మాట్లాడుతూ.. “శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత గౌరవానికి తార్కాణం సభలో ఏర్పాటు చేసిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ద్వారం. వీర మహిళ అనే ట్యాగ్ తో పార్టీలో పని చేస్తున్న ప్రతి మహిళకు ఆయన ఇచ్చే ప్రాముఖ్యతకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నామ”ని అన్నారు.
జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “జనసేన పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టి కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వ బీజం వేసిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలను మరువం. పిఠాపురం ప్రజల ప్రేమను గుండెల్లో పెట్టుకుంటాం. ఈ నియోజకర్గ ప్రజల ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని కాపాడుతాం. సదా మీ సేవలతో తరిస్తాం. జనసేన పార్టీ వచ్చింది మార్పు కోసం. మేము కోరుకున్న మార్పునకు పిఠాపురం పరిధిలోని యంత్రాంగం పనితీరు నిదర్శనం. రాబోయే రోజుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామ”ని అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ,”12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు ప్రజలకు మంచి చేస్తాయి. 12వ ఏట అడుగిడిన జనసేన పార్టీ రాష్ట్రంలో దుష్ట వైసీపీని గద్దె దించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసీపీ నాయకులు ఇదే ఒరవడి కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కి పరిమితం చేస్తామ”ని అన్నారు.

Share this content:

Post Comment