• రాజమండ్రిలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్
• అటవీ సంరక్షణ, నూతన అడవుల సృష్టిలో సిబ్బందికి శిక్షణ
* అటవీ విస్తీర్ణం 50 శాతానికి పెంచడమే లక్ష్యం
• భావితరాలకు కాలుష్యరహిత వాతావరణం అందిస్తామని హామీ
రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించడం, భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడం లక్ష్యాలుగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆ లక్ష్యం దిశగా సిబ్బందికి నైపుణ్యాన్ని పెంపొందిస్తామన్నారు. గురువారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం సమీపంలో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2017లో ఏర్పడిన రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ అప్పటి నుంచి రాజమహేంద్రవరంలోని రీజనల్ ఫారెస్ట్ సెంటర్ లో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. రూ.18 కోట్ల వ్యయంతో అధునాతన హంగులతో నూతన భవన నిర్మాణానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “అఖండ గోదావరి ప్రాజెక్టుతోపాటు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలను ఈ రోజు ప్రారంభించాం. రూ. 18 కోట్ల వ్యయంతో ఫారెస్ట్ అకాడమీ శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. అడవుల సంరక్షణ, నూతన అడవుల సృష్టి తదితర అంశాలపై ఫ్రంట్ లైన్ అటవీ శాఖ సిబ్బందికి శాస్త్రీయ పద్దతిలో మెలకువలు నేర్పేందుకు ఫారెస్ట్ అకాడమీ ఉపయోగపడుతుంది. అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్న అకాడమీ అటవీ విద్యా అభివృద్ధికి, పరిశోధనలు, పర్యావరణ పరిరక్షణతోపాటు గ్రీన్ కవర్ పెంపునకు దోహదం పడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం 33 శాతంగా ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 50 శాతంకి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్యాన్ని చేరేందుకు అవసరం అయిన పరిశోధనలకు, సిబ్బందిలో నైపుణ్యం పెంచేందుకు అకాడమీ సేవలు ఉపయోగపడతాయి. భవిష్యత్ తరాలకు కాలుష్యం లేని శుద్ధమైన వాతావరణం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సహకరించిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర అటవీ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు గారు, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పంతం నానాజీ, మద్దిపాటి వెంకటరాజు, చిర్రి బాలరాజు, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఆర్.పి. ఖజురియా, డాక్టర్ శాంతిప్రియ పాండే, రాహుల్ పాండే, విజయ్ కుమార్, డా.జ్యోతి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment