సైదాబాద్ చిన్నారి కుటుంబానికి పవన్ కల్యాణ్ ఆర్ధిక సాయం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి జనసేనాని అధినేత పవన్ కల్యాణ్ ఆర్ధిక సాయం అందించారు. ఆదివారం హైదరాబాదులో జనసేన తెలంగాణ విభాగం క్రియాశీలక కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సభా వేదిక వద్దకు వచ్చిన చిన్నారి తల్లిదండ్రులను పవన్ ఓదార్చారు. అనంతరం వారికి రూ.2.5 లక్షల నగదు చెక్కు అందజేశారు. ఆ చిన్నారి మృతికి సంతాపంగా వేదికపైనే కొద్దిసేపు మౌనం పాటించారు.

గతనెలలో సైదాబాద్ కాలనీలోని పల్లకొండ రాజు అనే యువకుడు ఇంటి పక్కనే ఉండే చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారకుడైన ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. పోలీసులు రాజు కోసం తీవ్ర గాలింపు చేపట్టగా, అతడు స్టేషన్ ఘన్‌‌పూర్ వద్ద రైలు పట్టాలపై శవమై కనిపించాడు. రాజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.

కాగా, నిందితుడు రాజు ఆత్మహత్యపై జ్యూడిషీయల్ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. వరంగల్ మూడో మేజిస్ట్రేట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది హైకోర్టు. నాలుగు వారాల్లో నివేదికను సీల్డ్ కవర్లో పంపాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాజు ఆత్మహత్యపై అనుమానాలున్నాయని కుటుంబసభ్యులు సైతం ఆరోపించారు.

అంతకుముందు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దొబ్బ కొట్టే కొద్దీ మంరిత ఎదుగుతానని జనేసన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బలమైన సామాజిక మార్పు కోసం పనిచేస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ జనసేన సైనికులను ఉద్దేశించి ఆయన శనివారంనాడు ప్రసంగించారు. 2009లో తాను తెలంగాణలో సంపూర్ణంగా పర్యటించానని ఆయన చెప్పారు. జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

2009లో తాను సభ పెడితే తెలంగాణ నుంచి పది లక్షల మంది వచ్చినట్లు ఆయన చెప్పారు. అన్నింటికీ సిద్ధపడే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. ఈ నేల తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. రాజకీయ చదరంగంలో ఒక్కో అడుగు వేయాలంటే ఎంతో ఆలోచించాలని ఆయన చెప్పారు.