బ్రిటన్‌లో కొత్తగా 101 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బ్రిటన్‌లో విలయం సృష్టిస్తున్నది. అక్కడ ఒకేరోజు 101 కొత్త కేసులు రికార్డయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 437కి చేరిందని బ్రిటన్ ఆరోగ్య అధికారులు మంగళవారం తెలిపారు. గతంలో వెలుగుచూసిన డెల్టా వేరియంట్ కంటే… ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తంగా చెందుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం అత్యవసర కేబినెట్ సమావేశంలో మంత్రులతో కోవిడ్ పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా వైరస్ కట్టడికి నిపుణుల సూచనల మేరకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రులకు ఆదేశించారు.
ఒమ్రికాన్ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. బ్రిటన్‌లో కొత్తగా 45,691 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10,560,341కు చేరింది. ఆ దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 1,45,826కు చేరింది. ప్రస్తుతం బ్రిటన్‌లో 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో దాదాపు 89 శాతం మంది మొదటి డోసు టీకా తీసుకున్నారు. 81 శాతం కంటే ఎక్కువ మంది రెండు డోసులు టీకా తీసుకున్నారు.