ప్రాథమిక, ఉన్నత విద్య పరంగా 27 అంశాల్లో మార్పులు… కేంద్ర నిర్ణయం

విద్యా వ్యవస్థలో కేంద్రం కీలక మార్పులు చేపట్టింది. డాక్టర్‌ కస్తూరి రంగన్‌ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాథమిక, ఉన్నత విద్య పరంగా మొత్తం 27 అంశాల్లో మార్పులు చేయనున్నారు. వీటిలో ముఖ్యంగా ఐదో తరగతి వరకు ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలని నిబంధన విధించారు. కుదిరితే 8వ తరగతి వరకు. అంతకు మించిన తరగతుల వరకు కానీ మాతృభాషలోనే విద్యాబోధన చేయడం ఉత్తమమని రాష్ట్రాలకు నిర్దేశించారు. కాగా, విద్యా హక్కు చట్టం కింద 3 నుంచి 18 ఏళ్ల వరకు విద్యను తప్పనిసరి చేశారు. గతంలో ఉన్న 10+2 స్థానంలో 5+3+3+4ను అమలు చేయనున్నారు. మొదటి ఐదేళ్లను ఫౌండేషన్ కోర్సు(3 ఏళ్ల వయసు నుంచి 8 ఏళ్ల వరకు), ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ (8 ఏళ్ల వయసు నుంచి 11 వరకు), ఆ తర్వాత మూడేళ్లను ప్రిపరేటరీ స్టేజ్ (11 ఏళ్ల నుంచి 14 వరకు), ఆ తర్వాతి నాలుగేళ్లను సెకండరీ స్టేజ్‌ (14 ఏళ్ల వయసు నుంచి 18 వరకు)గా పరిగణిస్తారు. డిప్లొమా కోర్సు రెండేళ్లు, వృత్తి విద్య కోర్సు వ్యవధి ఏడాదిగా నిర్ణయించారు. అలానే డిగ్రీ కోర్సు కాల వ్యవధి మూడు లేదా నాలుగేళ్లుగా మార్పు చేయనున్నారు.

కేంద్రం నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తగ్గట్లుగా ఐదో తరగతి వరకు తెలుగు మీడియం.. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం అమలు చేయడం ఓ ఆప్షన్‌గా కనిపిస్తోంది. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. విద్య అనేది కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలకు సంబంధించిన ఉమ్మడి అంశం కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తుందా అన్నది చూడాలి.