మహేశ్‌ బాబు నటనకు 41 వసంతాలు

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇండస్ట్రీకి వచ్చి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #MaheshBabu@41Years అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు 1979లో ‘నీడ’ సినిమాతో మహేష్ బాబుని బాలనటుడిగా పరిచయం చేశారు. తర్వాత చైల్డ్ ఆర్టిస్టుగా తండ్రి కృష్ణతో, అన్నయ్య రమేష్ బాబుతో కలిసి పోరాటం, శంఖారావం, కొడుకు దిద్దిన కాపురం, గూడాఛారి 117, బజారురౌడీ వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. బాలనటుడిగా ద్విపాత్రాభినయం కూడా చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమా ద్వారా తొలిసారి పూర్తిస్థాయిలో హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమా మహేశ్‌కు మంచి నటుడిగా గుర్తింపు తీసుకొచ్చింది. తరువాత వరుసగా ‘ఒక్కడు’,’అతడు’, ‘పోకిరి’, దూకుడు’ మరియు ‘బిజినెస్ మాన్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తనఖాతాలో వేసుకున్నారు. పక్కా కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ‘నాని’, ‘మురారి’ మరియు ‘నిజం’ లాంటి వైవిధ్యమైన సినిమాలను కూడా తీసి మంచి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు ఏడు నంది అవార్డులు, 5 ఫిలింఫేర్ ,3 సైమా అవార్డులను సొంతం చేసుకున్నారు. తన స్మైల్ తోనే అందరిని కట్టి పడేసే మహేశ్..విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను మరింతగా అలరించాలని కోరుకుందాం.