60 ఏళ్ల చారిత్రక ఆంధ్రభూమిని పునఃప్రారంభించాలి

– సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు వినతి

విశాఖపట్టణం, 1960లో ప్రారంభమై, తెలుగు రాష్ట్రాల్లో గ్రామ స్థాయి నుంచి వేలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తూ, ఉత్తమ జర్నలిస్టుగా తీర్చిదిద్దిన తమ అభిమాన దినపత్రిక ‘ఆంధ్రభూమి’ పునఃప్రారంభం కావాలని పాఠకులు కోరుతున్నారు. ఏ రాజకీయ పార్టీకీ కొమ్ముకాయకుండా నిష్పాక్షికంగా వార్తలు, వ్యాసాలు, సంపాదకీయాలు రాస్తూ ప్రజాదరణ పొందిన ఆంధ్రభూమి అనేకానేక కారణాల వల్ల కరోనా కష్టకాలంలో మూతబడటాన్ని పాఠకులు నేటికీ జీర్ణించుకోలేక పోతున్నారని పత్రికలో 32 ఏళ్ల పాటు గుంటూరు, విశాఖపట్టణం, విజయవాడ బ్యూరో చీఫ్ గా పనిచేసిన నిమ్మరాజు చలపతిరావు పేర్కొన్నారు. విశాఖపట్టణం బీచ్ రోడ్ లోని ఆంధ్రభూమి సహ పత్రికా సంస్థ డెక్కన్ క్రానికల్ కార్యాలయంలో తనకు సన్నిహితుడైన రీజినల్ మేనేజర్, సంస్థ ఆంధ్రప్రదేశ్ హెడ్ సివిఎన్ సుధాకర బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆంధ్రభూమిలో పనిచేసిన పర్మినెంట్ ఉద్యోగులందరి వేతన బకాయిలు, గ్రాట్యుటీని పూర్తిగా చెల్లించారని, అయితే అతి కొద్దిమందికి తుదివిడత చెల్లింపులు జరగాల్సి వుందని చలపతిరావు గుర్తుచేశారు. ఆంధ్రభూమిని పునఃప్రారంభించాలని దీర్ఘకాలంగా కొనసాగుతున్న పాఠకులు కోరుకుంటున్న విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలని ఆయనను కోరారు. ఆంధ్రభూమి పునఃప్రారంభానికి, అలాగే ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కొంటూ ప్రచురితమవుతున్న పత్రికలన్నిటికీ వాణిజ్య ప్రకటనల రూపేణా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలని నిమ్మరాజు విజ్ఞప్తి చేశారు. ఇందుకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన వివరించారు.

Share this content:

Post Comment