ప్రజలకోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం.. డా.వంపూరు గంగులయ్య

పాడేరు: ప్రజల కోసం జనసేన తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం అని అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య పేర్కొన్నారు. జనసేన నాయకుల గ్రామ పర్యటనలో భాగంగా గూడెం మండలం, గూడెంకొత్తవీది గ్రామంలో అద్దెరు వీధి గ్రామస్తులతో జనసేన నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పాలన తీరు మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు గిరిజనులకు అభివృద్ధి చేయడం దేవుడెరుగు? కానీ అభివృద్ధికి దోహదపడే వ్యవస్థలని నిర్వీర్యం చేయడం ద్వారా గిరిజనులకు ఏమి సందేశం ఇవ్వదలుచుకుంది. ఈ ప్రభుత్వం, ప్రజలే చెప్పాలి?. ముఖ్యంగా గిరిజన నిరుద్యోగులకు జీవో నెం3 రద్దు చేసి తీవ్రమైన ద్రోహం చేసింది, రైతులకు పంటల గిట్టుబాటు దరలేదు, ప్రతిభావంతులైన ఆదివాసీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు, సుమారు 42 పాఠశాలలు రద్దు, ఆశ్రమ పాఠశాలలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తల ఉద్యోగాలను రద్దుచేసి పరోక్షంగా విద్యార్థుల మరణాలకు కారణమయ్యింది. ఈ వైసీపీ ప్రభుత్వం ఆదివాసీలను అడవులనుంచి కూడా దూరం చేస్తూ పచ్చటి అడవుల్లో చిచ్చులు పెట్టి ఇక్కడ సహజ సంపద బడా కార్పోరేట్ కంపెనీలకు కట్టబెడుతూ ఈ ప్రభుత్వం సొమ్ముచేసుకుంటుంది. అందుకు ఉదాహరణకు చింతపల్లి మండలం, ఎర్రవరం పవర్ ప్రాజెక్ట్ గ్రామ తీర్మానం చేయకుండా 5థ్ షెడ్యూల్ అధికరణాలు, హక్కులు, చట్టాలు తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ శిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి ధారాదత్తం చేసే ఆలోచన చేస్తుంది. సాటి గిరిజనులుగా లేదా వ్యక్తులుగా మనపై చెడు చేసినా క్షమించ వచ్చు గాని, వ్యవస్థలను నాశనం చేసే దిశగా ఆలోచన చేస్తే ఆదివాసీలు తిరగబడకపోతే అంతరించిపోయే దశకు నెమ్మదిగా చేరుకోవడం ఖాయమని అన్నారు. అసలే గిరిజనాభివృద్ది అటకెక్కి ఉప ప్రణాళిక నిధులు పక్కదారి మళ్లించి మన అభివృద్దిని విస్మరించడం ఒక ఎత్తైతే.. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఎస్టీ జాబితాలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన బోయవాల్మీకి కులాలను కలపాలని తీర్మానించడం ఒక ఎత్తు. ఈ ప్రభుత్వానికి వంత పాడే మన ప్రజాప్రతినిధుల ఆలోచన కూడా ఆదివాసీ ప్రజల అంతం కొరడమేనని అన్నారు. యువతరం ప్రస్తుత పరిణామాలపై స్పందించి ధైర్యంగా ముందుకు వచ్చి ప్రశ్నించే తత్వం పెంపొందించుకోవాలని, ప్రశ్నిస్తేనే ప్రజాసమస్యలను పాలకులు గుర్తిస్తారని, ప్రశ్నించడం పౌరుడు యొక్క ప్రాథమిక హక్కు అని ఆధివాసిప్రజల క్షేమం కోసం పాలకులకు ప్రశ్నించడం కూడా ఒక గొప్ప బాధ్యతగా భావించాలని, జనసేన పార్టీ తరుపున ప్రజలకోసం మేము ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉంటామని, అలాగే గిరిజన యువత కూడా ప్రశ్నించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, గూడెం మండల నాయకులు గడుతురి పరమేష్, సిద్దార్ధ్ మార్క్, కొయ్యం బాలరాజు, మధు కుమార్, ఈశ్వర్, చింతపల్లి నాయకులు బుజ్జిబాబు, స్వామి, రాజబాబు, పాడేరు మండల పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, అశోక్ తదితరులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.