నెల్లి చెరువులో అక్రమ కట్టడాలు ఎందుకు తొలగించరు…?

  • అక్రమార్కుల వద్ద అధికారులకు భయమెందుకో..?
  • గౌరవ న్యాయస్థానాల ఆదేశాలు అధికారులకు పట్టవా..?
  • ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు జాగరపు ఈశ్వర్ ప్రసాద్

పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డుకు కూత వేటు దూరంలో ఉన్న నెల్లు చెరువులో అక్రమ కట్టడాలను ఎందుకు తొలగించరని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు జాగారపు ఈశ్వర ప్రసాద్ ప్రశ్నించారు. బుధవారం ఆ సమితి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడుతో కలిసి నెల్లిచెరువులో అక్రమ కట్టడాలను, ఆక్రమణలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ కు కూత వేటు దూరంలో ఉన్న నెల్లిచెరువు దర్జాగా కబ్జాలకు గురవుతుంటే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం అన్నారు. ఇప్పటికే చెరువులో పలు పక్కా భవనాలు నిర్మించగా ప్రస్తుతం కూడా భవన నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. దీని విషయంలో పలుమార్లు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితితో పాటు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పత్రికలు ఘోష పెడుతున్నా సంబంధిత ఇరిగేషన్, మున్సిపాలిటీ, రెవెన్యూ, సచివాలయాలకు చెందిన అధికారులు సిబ్బంది చోద్యం చూస్తున్నారన్నారు. ఎవరైతే ఆయా చెరువుల ప్రాంతంలో పనిచేసే అధికారులు సిబ్బందిని చెరువుల ఆక్రమణ విషయంలో సస్పెండ్ చేస్తే అప్పుడు ఉద్యోగ భద్రత కోసం ఆక్రమణలు అడ్డుకుంటారన్నారు. పనిష్మెంట్ లేకపోవడంతో చెరువులు దర్జాగా కబ్జా అవుతున్నాయన్నారు. నెల్లిచెరువులో ఈరోజుకి నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. అధికారుల అండదండలతోనే కబ్జాదారులు రెచ్చిపోతున్నారన్న అనుమానం కలుగుతుందన్నారు. చెరువులో పక్కా భవనాలు నిర్మాణాలు జరిగితే పట్టణానికి తాగునీటి కొరత ఏర్పడుతుందన్నారు. పర్యావరణం దెబ్బతిని ఉష్ణోగ్రతలు అధికంగా పెరగడానికి ఇదే కారణం అన్నారు. తక్షణమే సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అక్రమార్కులపై తగు చర్య తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో సంబంధిత అక్రమార్కులతో పాటు అధికారులపై కూడా చర్యలు కై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.