ప్రపంచ ప్రమాణాలుండే విద్యలో స్థానిక భాషకు ప్రాధాన్యముంటుంది… మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌-2020’ ఫినాలే కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ… నూతన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ) ఫై స్పందించారు. ఈ విధానం ఉద్దేశం ఉద్యోగార్థులను తయారు చేయడం కాదని, ఉద్యోగ సృష్టికర్తలను ఉత్పత్తి చేయడమేనని ఆయన వివరించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులే లక్ష్యంగా ఎన్‌ఈపీని తీసుకొచ్చామన్నారు. ‘‘21వ శతాబ్దం విజ్ఞాన కేంద్రం. నేర్చుకోవడం, పరిశోధనలు చేయడం, ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి పెట్టాలి. వీటినే ఎన్‌ఈపీలో పొందుపరిచాం. యువత ఎప్పుడూ చదవడం, ప్రశ్నించడం, సమస్యలను పరిష్కరించడంలో నిమగ్నమవ్వాలి. నేర్చుకున్నప్పుడే ప్రశ్నించే తత్వం అలవడుతుంది’’ అని వ్యాఖ్యానించారు. బరువైన బ్యాగులకు స్వస్తి చెప్పి.. జీవితగమనంలో సాయపడే విద్యను అందించడమే ఎన్‌ఈపీ ప్రధానోద్దేశమని తెలిపారు. ‘‘భాష అనేది సున్నితమైన అంశం. ఎన్‌ఈపీలో “స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వడం” ద్వారా అవి కూడా అభివృద్ధి చెందుతాయి. ప్రపంచ ప్రమాణాలుండే విద్యలో స్థానిక భాషకు ప్రాధాన్యముంటుంది. అంటే.. ఒక విద్యార్థి అడుగు స్థానికం నుంచి విశ్వవ్యాప్తం అవ్వాలనేదే మా ఉద్దేశం’’ అని వివరించారు. ఇంటర్‌-డిసిప్లీనరీ పద్ధతిలో విద్యార్థులు తమకు నచ్చి సబ్జెక్టులో చదువుకోవచ్చన్నారు. ‘‘ఇది పాలసీ డాక్యుమెంటే కాదు. 130 కోట్ల మంది భారతీయుల కలలకు ప్రతిరూపం. తాము చదువుకున్న సబ్జెక్టును నిరర్థకంగా భావించే పరిస్థితి విద్యార్థుల్లో ఇకపై ఉండదు. ఎన్ని డిగ్రీలు చేసినా.. తమకు నచ్చిన సబ్జెక్టులను ఒకటిగా చదివే అవకాశం ఇప్పటి వరకు లేదు. మూస పద్ధతిలో సబ్జెక్టులను చదివే విద్యార్థుల జీవితంలో ఆత్మవిశ్వాసం కనుమరుగయ్యేది. ఇకపై అలా కాదు. 21వ శతాబ్ద యువత కోసం ఈ విధానాన్ని తీర్చిదిద్దాం’’ అని వివరించారు.