వరహాల గెడ్డ బాధిత రైతులను ఆదుకోవాలి

  • గెడ్డ గట్టు తెగిపోవడంతో 50 ఎకరాల పొలాల్లో నిండిన మున్సిపల్ చెత్త, చెదారం
  • మూడేళ్లుగా పంటలు వేయలేకపోతున్న చిల్లంగి పొలం రైతులు
  • జిల్లా కలెక్టర్ స్పందనలో ఫిర్యాదు చేసిన ఫలితం లేదన్న రైతులు
  • రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్న జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురంలోని వరహాల గెడ్డ బాధిత రైతులను ఆదుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయకులు కోరారు. శుక్రవారం జనసేన పార్టీ జిల్లా నాయకులు చెందక అనిల్ కుమార్, వంగల దాలి నాయుడు, నెయ్యిగాపుల సురేష్, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, మానేపల్లి ప్రవీణ్, వీరమహిళ బోనెల గోవిందమ్మ తదితరులు పార్వతీపురం పట్టణంలోని రైల్వే ట్రాక్ ఆవల ఉన్న సాయి నగర్ కాలనీ సమీపంలోని వరాహాల గెడ్డ బాధిత రైతులకు చెందిన చిల్లంగి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు కొల్లి శంకర్రావు, కొల్లి కృష్ణ, కొల్లి రమణ, మువ్వల రమేష్, గార రాములు, కాగితం సత్తి, కొల్లి గంగరాజు, తాడి రామారావు పిల్లవేణు తదితర రైతులు జనసేన పార్టీ నాయకుల వద్ద తమ సమస్యలు ఏకరువుపెట్టారు. పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డు మీదుగా ప్రవహిస్తూ రైల్వే ట్రాక్ దాటి వచ్చే వరహాలు గెడ్డ గతంలో పొలాల మధ్యగా ప్రవహించి, కొర్ల చెరువులో కలిసి అక్కడ నుండి రాళ్లగెడ్డకు ప్రవాహం వెళ్లి కలిసేదన్నారు. అయితే గత రెండేళ్ల క్రితం వరహాలు గెడ్డ ప్రవాహంలో మున్సిపాలిటీకి చెందిన మురుగునీరు కలపడంతో గెడ్డ ప్రవాహం అధికమై చిల్లంగి పొలాల వద్ద గెడ్డ గట్టు కొట్టుకుపోయిందన్నారు. దీంతో వరహాలు గెడ్డ నుండి వచ్చే మున్సిపాలిటీ మురుగు, ఆసుపత్రుల చెత్త, చిరంజీ సూదులు గాజు పాత్రల ముక్కలు, బాటిల్స్, బీరు సీసాలు, పాలిథిన్ కవర్లు, టైర్లు తదితర చెత్తాచెదారం పొలాల్లో పేరుకుపోయిందన్నారు. దాదాపు 50 ఎకరాల పొలాలు వరహాలు గెడ్డ ద్వారా వచ్చే మున్సిపల్ చెత్తాచెదారంతో నిండిపోయాయని వాపోయారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులు వద్దకు వెళ్లి గేడ్డ గట్టును పున: నిర్మించాలని, గెడ్డలో పూడికతీత పనులు చేపట్టాలని కోరడం జరిగిందన్నారు. సంబంధిత మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమం లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ చర్యలు శూన్యం అన్నారు. ఉన్న ఎకరా రెండు ఎకరాలతో పంటలు పండించి జీవనం సాగించే తాము గత రెండేళ్లుగా పంటలు పండించలేక కుటుంబాలతో పస్తులు ఉంటున్నామన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ స్పందనలో కూడా రైతు సమస్యలు పరిష్కారం కాకపోతే అంతకంటే అన్యాయం ఇంకెక్కడ ఉండదన్నారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు, అధికారులు ఈ రైతుల సమస్య పరిష్కరించాలన్నారు. వరహాల గెడ్డ గట్టును ఇప్పుడు నిర్మించి పూడిక తీత పనులు, జంగిల్ క్లియరెన్స్ పనుకు చేపట్టి గడ్డ ప్రవాహం నేరుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో రైతులకు ప్రతి ఏటా ఎకరాకు 30 వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు తక్షణమే గత రెండేళ్ల నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు చిల్లంగి పొలాల రైతు సమస్యలు పరిష్కరించని పక్షంలో రైతులు తరఫున ఆందోళన చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధితు రైతులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.