పులివెందుల నుంచి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు

  • మనం పులివెందుల వెళ్లి గోదావరి సంస్కారాన్ని జగన్ రెడ్డికి నేర్పుదాం
  • రాజోలు విజయం వెలుగులు రాజంపేట వరకు ప్రసరింపచేస్తాం
  • క్రిమినల్స్ రాజకీయాల్లో ఉంటే విలువలు పాటించే వారు లొంగిపోతారు
  • వైసీపీ చేసేది కుల ప్రాతిపదిక రాజకీయాలు.
  • అలాంటి రాజకీయాల వల్లే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారింది
  • ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు గోదారి దాటి వెళ్లిపోయారు
  • ప్రజలు ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారు
  • శ్రీ రాపాక సహా అలాంటి వారిని రీకాల్ చేసే హక్కు ప్రజలకుండాలి
  • రాజోలు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు
  • పవన్ కళ్యాణ్
  • ‘రాజకీయాల్లో గొడవలు సహజం.. నేరపూరిత వ్యవస్థ ఉండకూడదు.. పులివెందుల నుంచి వచ్చి పచ్చటి గోదావరి జిల్లాల్లో దౌర్జన్యం చేస్తున్నారు. మేము రాజోలు నుంచి అక్కడకి వెళ్లి జగన్ రెడ్డికి సంస్కారం నేర్పిస్తాం. రాజోలు విజయం చీకట్లో చిరుదివ్వెలా మాకు ప్రేరణ ఇచ్చింది.. రాజోలులో వెలిగించిన ఈ దీపం భవిష్యత్తులో రాజంపేట వరకూ వెలుగులు ప్రసరింప చేస్తుందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. క్రిమినల్ రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. పెద్ద మనుషుల ముసుగులో నేరాలు చేస్తూ పాలిస్తామంటే చికాకుగా ఉంటుందని చెప్పారు. రాజోలు విజయం తాలూకు వెలుగు ఏదో ఒక రోజు అఖండ జ్యోతిగా మారి రాష్ట్రం మొత్తం వెలుగులు ఇస్తుందని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు మార్పుకి సంకేతమని, ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికారంలో ఉన్న వారు ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ తొక్కుతారని చెప్పారు. దొంగ ఓట్లు వేస్తారు.. ఉన్న ఓట్లు తీసేస్తారని, వీటన్నింటి మీద మనం పోరాటం చేయాలని సూచించారు. ఆదివారం మధ్యాహ్నం దిండి రిసార్ట్ లో రాజోలు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశం అయ్యారు.
  • ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఒక పార్టీ నిర్మాణం చాలా కష్ట సాధ్యమైన అంశం. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేలాది కోట్లు దోచేసి.. అది కాస్త లక్ష కోట్లు దాటేసే పరిస్థితి. అలాంటి క్రిమినల్ రాజకీయాలు చేసే వ్యక్తులు, దౌర్జన్యాలు చేయగలిగే సమూహాలు ఉంటే విలువలు పాటించే వారు కూడా వారికి లొంగిపోతారు. ఇలాంటి వ్యవస్థల మధ్య రాజకీయ పార్టీ పెట్టడం చాలా సాహసోపేతమైన నిర్ణయం. పార్టీ పెట్టడానికి కుల బలమో, ఒక ప్రాంతం బలమో సరిపోదు. మనది ప్రజాస్వామ్యం.. కులస్వామ్యం కాదు. ఒక కులం ఆధారంగా రాజకీయం చేయలేము. కులాలను గుర్తించి, గౌరవించి అసమానతలు 

తగ్గించాలి. కుల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తే అది వైసీపీ రాజకీయం అవుతుంది. అలాంటి రాజకీయాల వల్లే రాష్ట్రం అస్ధవ్యస్తంగా మారింది.
• జనసేన భావజాలం ప్రజలకు అవసరం
ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని కులాలు, మతాల సమూహం నుంచి విభిన్న కులాల వారితో పార్టీ స్థాపించాను. 150 మంది సభ్యులతో నాడు మొదలైన పార్టీ ఈ రోజున ఒక్క నియోజకవర్గంలోనే 10,214 మంది క్రియాశీలక సభ్యులు ఉన్న స్థితికి చేరింది. గెలుపుతో అది సాధ్యపడలేదు. గెలిచిన ఎమ్మెల్యే పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా బలమైన సమూహం మద్దతు తెలిపిందంటే భావ జాలం ప్రజల్లోకి బలంగా వేళ్లూనుకుంటుందని అర్ధం. గెలవకపోయినా పార్టీకి బలంగా మద్దతుదారులు పెరుగుతున్నారు. ఒక సైద్ధాంతిక బలం నచ్చడమే అందుకు కారణం. తెలంగాణ రాష్ట్ర సాధన కూడా అలా జరిగిందే. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ప్రజలకు జనసేన భావజాలం అవసరం కచ్చితంగా ఉంది.
వారాహి యాత్ర రాజోలులో మొదలవగానే ఒక ఆడపడుచు పుస్తకం ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ గురించి ఒక సాధారణ గృహిణి శ్రీమతి ప్రశాంతి గారు అద్భుతంగా రాశారు. కేంద్రీయ విద్యాలయాల ఆవశ్యతను తెలియచేశారు. సగటు గృహిణిగా సమస్య తనకు అర్ధం అవుతుంది. రాజకీయ నాయకులకు ఎందుకు అర్ధం కావడం లేదన్నదే ఆమె ఆవేదన. ఆత్మగౌరవంతో సంపాదించుకునే అవకాశాలు కల్పించాలని పాలకులను కోరుతున్నారు. ఇలాంటి వారి వల్లే చీకట్లో చిరుదివ్వెలా రాజోలులో విజయాన్నందించారు. వాళ్లు లక్షల కోట్లు దోపిడి చేసి ధైర్యంగా తిరుగుతారు.. రెండు వందలు లంచం తీసుకుంటే మధ్య తరగతి ఉద్యోగికి మాత్రం వెంటనే శిక్ష పడిపోతుంది. వేల కోట్లు దోచిన వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. ఇది మన దేశం తాలూకు దౌర్బాగ్యం. ఇలాంటి వన్నీ చూస్తూ అడవుల్లోకి వెళ్లి యుద్దం చేయాలనుకోలేదు. ప్రజాస్వామ్య క్షేత్రంలో కూర్చుని యుద్ధం చేయడానికి వచ్చా. రెండు దశాబ్దాల ప్రస్థానం ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. ఎంపీటీసీగా గెలిచిన ఒక సత్యవాణి గారు, తన అభిప్రాయాల్ని అక్షరాల్లో చూపించిన ప్రశాంతి గారు లాంటి వారు ఉంటే రాజోలు లాంటి చోట విజయం సాధించి తీరుతాం. అంతటి పోరాట పటిమ ఉన్న మహిళలకు రాజకీయాల్లో మూడో వంతు కూడా ఇవ్వలేకపోతున్నాం. రాజకీయాల్లో మూడో వంతు మహిళలకు అవకాశం కల్పించాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో తెచ్చేందుకు జనసేన పార్టీ తనవంతు పని చేస్తుంది. నేను సత్యాన్ని మాట్లాడేందుకే రాజకీయాల్లోకి వచ్చాను. నాకు జనం అండ, ఆడపడుచుల దీవెనలు, ఆ భగవంతుడి రక్ష ఉన్నాయి.
• మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు…
రాజోలు విజయం నాకు స్ఫూర్తినిచ్చింది. రాజకీయాల్లో వర్గాలు వర్గాలు సహజం. పార్టీలో వర్గాలు ఉన్నా అవి పార్టీని గెలిచించేవిగా ఉండాలి. శ్రీ రాపాక వరప్రసాద్ వెళ్లిపోయినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. మనం కోరుకున్న మార్పు ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి. అది ఉభయ గోదావరి జిల్లాల్లోనే కావాలి. రాజోలు విజయం ప్రేరణ ఇచ్చింది. పచ్చటి ఉభయ గోదావరి జిల్లాలకు దిష్టితగిలింది. తాగడానికి నీరు లేదు. వాడుకకు నీరు లేదు. అక్వా కల్చర్ తో డబ్బు వస్తోంది.. దానితో పాటు కాలుష్యమూ వస్తోంది. ఇసుక దోపిడితో తీర ప్రాంతం మొత్తం నాశనం అయిపోతోంది. కాకినాడ నుంచి ఒక్కడు కూర్చుని గోదావరి జిల్లాలను శాసిస్తుంటే ఆశ్యర్యం వేసింది. ఇంత మంది పెద్దలు ఉండి ఒక్కరు ఎదురుతిరగకపోవడం బాధించింది. ఆ ఒక్కడికి పైన ఉన్న ఒక్కడి ఆశీర్వాదాలు ఉన్నాయి. రౌడీలు, కేడీలు సగటు మనిషిని బాధిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా.. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా స్వయంగా నేనే వస్తా. ఉభయ గోదావరి జల్లాలకు కూతవేటు దూరంలో అందుబాటులో ఉంటా. భీమవరం, రాజమండ్రిలో కార్యాలయాలు ఉన్నాయి. పిఠాపురం, అమలాపురంలో పెట్టబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ కి వైసీపీ నుంచి విముక్తి చేయాలంటే ముందు ఉభయ గోదావరి జిల్లాలను విముక్తం చేయాలి. అదే నా కోరిక . 34లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవ కూడదు.
• ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు
ఇక్కడ మహిళలకు రక్షణ లేదు. తీర ప్రాంతం మొత్తం దోపిడి చేసేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేయలేదు. మద్యపాన నిషేదం చేస్తామని చెప్పి మద్యం వ్యాపారం చేసుకుంటున్నారు. హత్యలు చేసేసి ఊరేగింపులు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వేధిస్తున్నారు. దళితుల మీద కూడా అట్రాసిటీ కేసులు పెడతారు. చట్టాలను దుర్వినియోగం చేస్తుంటే కూర్చుని చూస్తూ ఉండాలా? మా హక్కులకు భంగం కలిగించినప్పుడు ఎదురు తిరిగి పోరాటం చేయాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. శ్రీ రాపాక వరప్రసాద్ సహా అంతా మీ ఓట్లతో గెలిచి గోదావరి దాటి అసెంబ్లీకి వెళ్లిపోయారు. ఇప్పుడు అడిగితే కేసులు పెడుతున్నారు. శ్రీ రాపాక లాంటి వారిని రీ కాల్ చేయాలి. ఆ హక్కు ప్రజలకు ఉండేలా చట్టాలు రావాలి. ఇది ప్రజాస్వామ్యం, ఏక వ్యక్తి స్వామ్యం కాదు. కనీసం వార్డు మెంబర్ కూడా ప్రజల మాట వినని పరిస్థితుల్లో సమస్యలపై గళం వినిపించేందుకు జనవాణి పెట్టాం.
• వ్యక్తులు చేసే తప్పు కులసమూహాల మీద పడుతుంది
కుల, మతాల ప్రస్తావన సరిదిద్దడానికే నేను ఆ ప్రస్తావన ఎత్తుతాను. రెచ్చగొట్టేందుకు కాదు. అమరావతి రాజధాని ఒక కులానికి అంటగట్టేశారు. అక్కడ అన్ని కులాలు ఉన్నాయి. జబ్బుని తగ్గించేందుకు సలహా ఇవ్వడంలో తప్పులేదు. కాపు సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్సీ శ్రీ అనంతబాబు దళిత డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసేసి హ్యాపీగా ఊరేగింపులు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఆ హత్యతో ఇతర సామాజికవర్గాలను కాపులకు దూరం చేసేస్తారు. ఎవరు ఎవర్ని చంపినా దానికి కులంతో సంబంధం లేదు. వ్యక్త తప్పు చేస్తే అది కుల సమూహం మీద పడుతుంది. సమాజంలో పరివర్తన జరగాలంటే నిస్పక్షపాతంగా మాట్లాడాలి. తప్పులు చేసే వారిని వ్యవస్థలు నియంత్రించాలి.వ్యవస్థలు నియంత్రించలేనప్పుడు వారిని మనమే నియంత్రించాలని అన్నారు.
* దొంగ పనులు చేసేది వైసీపీయే : శ్రీ నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో మేధావులతో శ్రీ పవన్ కళ్యాణ్ సమావేశమవుతుంటే వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. కాకినాడలో శ్రీ పవన్ కళ్యాణ్ ని కలిసిన మేధావులను స్థానిక ఎమ్మెల్యే ఇంటికి పిలిచి బెదిరించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు. ఆ ధీమాతోనే ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత నాదే అని ముఖ్యమంత్రి భరోసా ఇస్తున్నారు. రాజోలు జనసైనికులు, వీరమహిళలు చూపించిన తెగువా, రాజకీయ వ్యూహాలు రాష్ట్రంలోని ప్రతి జన సైనికుడు, వీర మహిళలకు స్ఫూర్తిదాయకం. వ్యక్తిగత స్వార్థం లేకుండా పనిచేసిన తీరు అందరికీ ఆదర్శవంతం. జనసైనికుల నిజాయతీ, పట్టుదల తట్టుకోలేక స్థానిక వైసీపీ నాయకులు కేసులు పెట్టడం, చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తే బిల్లులు నిలిపివేయడం చేస్తున్నారు” అని అన్నారు. సమావేశంలో పార్టీ నేతలు శ్రీ కందుల దుర్గేష్, శ్రీ పంతం నానాజీ, శ్రీ పితాని బాలకృష్ణ, శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ డి.వరప్రసాద్, శ్రీ బొంతు రాజేశ్వర రావు, శ్రీ తాడి మోహన్, తదితరులు పాల్గొన్నారు.