జోహార్ గ్రామంలో హలొ ఏపీ.. బై బై వైసీపీ

  • జనసేనలో పెద్దఎత్తున చేరిన జోహార్ గ్రామ యువత
  • బలి ఇచ్చేముందు గొర్రెలకి మేత పెట్టడం సహజం, ఈ విషయం గ్రహించి ఓటు వేయాలి
  • కేవలం కాగితాలలో మాత్రమే గిరిజనాభివృద్ది
  • మార్పుకోసం పాటుపడే జనసేన పార్టీకి అండగా ఉండాలి
  • అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. గంగులయ్య

పాడేరు నియోజకవర్గం: చింతపల్లి మండలం, జోహార్ గ్రామ యువత పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. గంగులయ్య ముందుగా చింతపల్లి మండల అధ్యక్షులు వంతల బుజ్జిబాబు, జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ స్థానిక గ్రామస్తుల మాతృభాష కువి భాషలోనే పలు గ్రామ సమస్యలు గ్రామయువతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డా. గంగులయ్య మాట్లాడుతూ.. జోహార్ గ్రామయువత పెద్దలకు మనవి మీరు ప్రస్తుత రాజకీయాలను వాస్తవిక కోణంతో చూడాల్సి ఉందని అన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వ పాలనలో ఒక వైపు సంక్షేమపదకాలంటు డబ్బు పంపిణీ వంటి సంపద సృష్టి లేని కార్యక్రమాలు పథకాలు చేస్తూనే.. ఇంకో వైపు నిత్యావసర ధరలు విపరీతంగా పెంచుకుంటూపోతుంది. ఒకవైపు విపరీతమైన అప్పు చేస్తూ తమరాజకీయాధికారం కాపాడుకోవడం కోసం ప్రజల నెత్తిమీద అంతులేని ఋణబరాన్ని పెంచుకుంటూపోతుంది. సహేతుకమైన సంపద సృష్టి లేకుండా కేవలం రుణంపై ఆధారపడి పాలన కొనసాగించడం రాష్ట్ర భవిష్యత్ కి మంచిది కాదని విద్యావంతులందరికి తెలిసిన విషయమే కానీ ఈ అంతర్గత కుహనా రాజకీయాలు సామాన్యులకు అర్థం కాకపోవడం ఇక్కడ జరిగే అనర్థాలకు ప్రధాన కారణం. ఇలా ఉంటే మన ఆదివాసీ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత అద్వాన్నంగా ఉన్నాయి. వాస్తవమేమిటంటే దేశంలో అత్యంత ఎక్కువ రిజర్వేషన్ శాతం, నిధుల కేటాయింపులు మన ఆధివాసీలకే అయినప్పటికీ నేటికీ ఆదివాసీ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన విషయంలో పరిశీలిస్తే గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం పనితీరు తేటతెల్లం అవుతుంది. ఒకవైపు డోలి మోతలతో గిరిజనులు మృత్యువాత, ఒకవైపు గిరిజన నిరుద్యోగ యువతకు జీవో నెం3 రద్దుతో ద్రోహం, స్థిరమైన ఉపాధి కల్పన విషయంలో వైఫల్యాలు ఇలా ఒకటి కాదు, రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఇటువంటి సమస్యలు కోకొల్లలు. సగటు గిరిజనుడు కనీసం మాట మాత్రమైనా ఆలోచించకపోవడం భావితరాల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడానికి ఒక కారణం. కేవలం ప్రభుత్వాలు కాగితాలలో మాత్రమే గిరిజనాభివృద్దిని చూపిస్తారు తప్పితే క్షేత్రస్థాయి అమలు విషయంలో ప్రశ్నిస్తే నీళ్లు నములుతున్నారు. వైకాపా ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ. విలువలతో కూడిన ప్రజాక్షేమ పరిపాలన చేయగల ప్రభుత్వ స్థాపన కచ్చితంగా జరగాలంటే జనసేన పార్టీకి మద్దతు తెలపండి అంటూ గ్రామస్తులనుద్దేశించి గంగులయ్య పిలుపునిచ్చారు. లీగల్ అడ్వైజర్ రాజన్ కువి భాషతో మాట్లాడుతూ కువి జాతి ప్రజలకు వైసీపీ ప్రభుత్వం తీవ్రమైన ద్రోహం చేస్తుందని, ఇప్పటికి రోడ్లు సౌకర్యం లేని ప్రాంతాలు అనేకం ఉన్నాయని అలాగే రిజర్వేషన్ ఆధారిత ఉత్తమ విద్యకు గల బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని కూడా రద్దు చేసి ఇప్పుడు నాడు నేడు అంటు అమ్మఒడి అంటూ ప్రతిభ ఆధారిత విద్యకు తూట్లు పొడుస్తుందని, అలాగే గతంలో ఒక ఇంట్లో ఎంత మంది విద్యార్థులున్నా వారికి పీజు రియంబర్స్ మెంట్ కింద పీజురుసుము వచ్చేవని, ఇప్పుడు కేవలం అమ్మ ఒడి పధకం ఒకరికే పరిమితం చేసి మిగతా వారి పరిస్థితిని గమనించకుండా ఉద్దేశ్యపూర్వకంగానే విద్యకు దూరం చేయడం కాదా? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు?. ఈ విషయం కువి జాతి ప్రజలు గమనించాలని బలి ఇచ్చేముందు గొర్రెలకి మేత పెట్టడం సహజమనీ ఈ విషయం తెలుసుకుని ఓటు వేయాలని అన్నారు. అందుకే మార్పుకోసం పాటుపడే జనసేన పార్టీకి మీరంతా అండగా ఉండాలని కోరుతున్నామన్నారు. చింతపల్లి మండల నాయకులు బుజ్జిబాబు మాట్లాడుతూ విద్యావంతులైన యువత ఆదివాసీ సమాజ శ్రేయస్సు కోరి జనసేన పార్టీ ద్వారా గ్రామ పర్యటన చేస్తుందని అందరూ జనసేన పార్టీని ఆదరించాలని అన్నారు. ఈ సందర్బంగా గ్రామయువత పెద్దఎత్తున జనసేన పార్టీ కండువాలు గంగులయ్య, బుజ్జిబాబు, రాజన్ గారి చేతులమీదుగా కప్పుకుని పార్టీలో చేరారు. ఈ సమావేశంలో లీగల్ అడ్వైజర్, రాజన్, బుజ్జిబాబు, సందేశ్, రవి, స్వామి, శేఖర్, రాజు, హరీష్, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, జి.మాడుగుల నాయకులు తాంగుల రమేష్, ఐటి ఇన్చార్జ్ అశోక్, సంతోష్, తదితర జనసైనికులు పాల్గొన్నారు.