పురోహితులను వేలంపాట వేసే దౌర్భాగ్య పరిస్థితి: పంతం నానాజి

కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్, జనసేన పి.ఏ.సి సభ్యులు కాకినాడ రూరల్ ఇంఛార్జి పంతం నానాజీ స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న తణుకు వారాహి సభలో పవన్ కళ్యాణ్ బ్రాహ్మణులు, అర్చకులకి జరుగుతున్న అన్యాయం కోసం మాట్లాడారు. అన్నవరంలో ఓ ఈ.ఓ బ్రాహ్మణుల వేలం పాట అని ప్రతిపాదన తీసుకువచ్చి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారని, దాని వలన పౌరహిత్యం, బ్రాహ్మణుల మనుగడకే ముప్పు ఉందని తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. పురోహితులను వేలం పాట వేసే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఒక సీరియల్ ప్రకారం ఇసుక, మందు వేలం పాట వేసినట్లు పూజాది కార్యక్రమాలు చేసే బ్రాహ్మణులకు వేలం పాట నిర్ణయించటం సిగ్గు చేటని అన్నారు. ఎవరినైతే మనం పవిత్రంగా భావిస్తామో అటువంటి బ్రాహ్మణులకు వేలంపాట అన్నవరంలో మొదలై రాష్టం వ్యాప్తంగా అమలు చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఎవరి ఆచారం ప్రకారం వారి కుటుంబ సంప్రదాయ ప్రకారం పెళ్లిళ్ళ తంతు జరుగుతుందని, కుటుంబ ఆచారాలు తెలిసిన పురోహితుల ద్వారా తంతు జరిపించుకుంటారన్నారు. ఇటువంటి చర్యల వల్ల ఒక మతం యొక్క స్వాతంత్ర్యానికి భంగం కలిగే అవకాశం ఉందన్నారు. చిన్న పిల్లాడు త్రాగే పాలు దగ్గర నుండి మనిషి చనిపోయే వరకు మీరు వ్యాపార దోరణితో చూస్తున్నారు అని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒక ప్రసిద్ది చెందిన దేవాలయం లో ఆలయ అధికారి ఒక ప్రతిపాదన తీసుకువచ్చి దాన్ని అమలు చేస్తుంటే దానిపై దేవాదాయ శాఖ మంత్రికి తెలియకపోవటం సిగ్గు చేటన్నారు. ప్రవచన కర్తలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, గరిగపటి నరసింహారావు లాంటి వారు అర్చకులకు అండగా ఉండాలని కోరారు. జనసేన పార్టీ పూర్తిగా అర్చకులకు, బ్రాహ్మణులకు అండగా ఉంటుందన్నారు. అనంతరం బ్రాహ్మణ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు యల్ల జ్యోషుల శ్రీరామ్ కుమార్ మాట్లాడుతూ అర్చకుల కోసం పవన్ కళ్యాణ్ మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ నాయకులు. పట్టించుకోలేదని, బ్రాహ్మణుల వేలం పాట అనీ అన్నవరం ఈ.ఓ పేపర్ లో ప్రకటన ఇచ్చారనీ, రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ దేవాదాయ శాఖ మంత్రికి కానీ సంబందం లేకుండా ఒక అధికారి ఇటువంటి ప్రకటన చేసి దాన్ని ఏ విధంగా అమలు చేస్తారని ఆరోపించారు. గతంలో 100 కోట్ల అవినీతి ఆరోపణ కేసు ఈ.ఓ పై ఉందనీ ఆరోపించారు. అన్నవరంలో బయట పురోహితులు వచ్చి పెళ్లిలు చేయకూడదని అంటున్నారని, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు అందరు కలిసి ఏకతాటిపైకి వచ్చి ఉద్యమిస్తామని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కగజేసుకుని అర్చకుల వేలం పాటని, ప్రకియని అపి అర్చకులకు అండగా ఉండాలని కోరారు.