పవన్‌ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు సిగ్గుచేటు

  • జనసేన నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికం
  • జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి

నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తిరుపతి జిల్లా, వెంకటగిరి పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు అని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌ రెడ్డి విమర్శించారు. శుక్రవారం నగరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వెంకటగిరి పర్యటన కోసం జనసేన పార్టీ నాయకులను హౌస్‌ అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. జగన్‌ రెడ్డి ఏ ప్రాంతానికి వస్తే .. ఆ ప్రాంత ప్రజలు భయపడిపోతున్నారన్నారు. సీఎం స్థాయిలో ఉండి ఇంతటి దిగజారుడు మాటలు ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదన్నారు. ఇది చేతకాని తనానికి, అసమర్థుడు జగన్‌ మోహన్‌ రెడ్డి అనే దానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి పదవికి జగన్‌ అనర్హుడని దుయ్యబట్టారు. ప్రజల వ్యక్తిగత వివరాలు వలంటీ-ర్స్‌ ఎవరికీ చేరవేస్తున్నారు.. అవి సురక్షితంగా ఉన్నాయా అని పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించారని, దానికి సమాధానం చెప్పలేక ఒక సీఎం పదవిలో ఉండి వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకర మన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడు తున్నారని, ఆయన దిగజారుడు మాటలని ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లు, దౌర్జన్యాలు, దోపిడీలు చూశామన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు జగన్‌కి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి ఈ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని, దీనిని మానుకోవాలని హితవు పలికారు. జిల్లా కార్యదర్శి షేక్‌ ఆలియా మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంతవరకు వరకు పవన కళ్యాణ్‌ జపం చేస్తున్నారని విమర్శించారు. ఈ నాలుగేళ్లల్లో పవన్‌ గురించే ఆలోచన చేశారని, ఇక మిగిలిన సమయమైనా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీఎం జగన్‌ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని విమర్శించారు. రాయలసీమ నుంచి సుమారు 7గురు ముఖ్యమంత్రులు అయ్యారని, ఇటువంటి ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చూడలేదని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానకపోతే రాబోయే రోజుల్లో జనసైనికులు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు పవన్‌, కంతర్‌, కరీమ్‌, వెంకటేశ్వర్లు, రేవంత్‌, సౌమ్య, సాయి, శ్రీకాంత్‌, ఉదయ్‌, అలేఖ్‌, మాధవ్‌, తదితరులు పాల్గొన్నారు.