కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి శోచనీయం

  • జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జీ శివ కోటి యాదవ్
  • ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితి “పని బారెడు జీతం బెత్తడు” అన్నట్లుగా మారింది.
  • తెలంగాణలో వేతనాలు పెరుగని కార్మికులు ఎవరయిన ఉన్నారంటే ఒక్క పంచాయతీ కార్మికులు మాత్రమే.సరి అయిన సమయంలో నెల నెల జీతాలు అందక అప్పుల పాలవుతు ముప్పు తిప్పలు పడుతున్నారు.
  • రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ డిమాండ్.

నర్సంపేట మంగళవారం: నెల రోజులు గడిచినా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి శోచనీయమని జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జీ శివ కోటి యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం నర్సంపేట డివిజన్ లోని ఖానాపూర్ మండల కేంద్రంలో తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత 34 రోజుల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకి జనసేన పార్టీ తరఫున నియోజకవర్గ ఇంచార్జీ మేరుగు శివకోటి యాదవ్ హాజరు అయ్యి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా శివ కోటి యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 వేల గ్రామపంచాయతీల్లో దాదాపు 60,000 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారని ఈ రోజు వారందరి పరిస్థితి “పని బారెడు వేతనం బెత్తడు” అన్నట్లుగా మారిందని, అలాగే వారికి ప్రభుత్వం నుంచి సరి అయిన సమయానికి నెల నెలా జీతాలు అందక అప్పుల పాలవుతు ముక్కు తిప్పలు పడుతున్నారని అన్నారు. అలాగే తెలంగాణలో వేతనాలు పెరుగని కార్మికులు ఎవరయిన ఉన్నారంటే అది ఒక్క పంచాయతీ కార్మికులు మాత్రమే అన్నారు. పంచాయతీ సిబ్బందిలో నూటికి 80 శాతం దళిత, అట్టడుగు వర్గానికి చెందిన వారేనని, వారందరూ గ్రామ పంచాయతీల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తూ, తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారని, అలాగే కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకి విశేష సేవలు అందించారని, అలాంటి వారి న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయం అన్నారు. కావున ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్పందించి వారి విశేష సేవలు గుర్తించి వారిని పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కలిగించి, జీవో నెంబర్ 60 ప్రకారం రూ 19,000/-వేల లోపు పేర్కొన్న కేటగిరీల వారిగా వేతనాలు చెల్లించి, వారి మీద పనిభారం మోపుతు, తీవ్ర వత్తిడికి దారితీస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జీవో 51 ప్రకారం మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి, వారిని పాత పద్ధతిలోనే యధావిధిగా కొనసాగించాలని, అలాగే వారి ఇతరత్రా డిమాండ్లను పరిష్కరించాలని జనసేన పార్టీ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపురం మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, నాయకులు రోడ్డ శ్రీకాంత్, ఒర్సు రాజేందర్, బొబ్బ పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.