పశువుల కోసం బందెలదొడ్డి ఏర్పాటు చేయాలి

  • పట్టణ మెయిన్ రోడ్డులో విచ్చలవిడిగా పశువుల సంచారం
  • ప్రమాద బారిన పడుతున్న ప్రజలు, ముగజీవాలు
  • మూగ జీవాలకు ఆసరా కల్పించాలని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డులో విచ్చలవిడిగా సంచరిస్తున్న మూగజీవాలైన పశువులకు ఆసరా కల్పించాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. ఆదివారం జనసేన జిల్లా నాయకులు వంగల దాలినాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, తామరకండి తేజ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ.. గత కొంతకాలంగా పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డులో రాయగడ రోడ్డు మొదలుకొని నాలుగు రోడ్ల జంక్షన్ వరకు పదులకొద్ది పశువులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయన్నారు. రోడ్డుపై వాటి వలన ప్రయాణికులకు, వ్యాపారులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. కొన్ని సమయాల్లో పశువులు పోట్లాడుకొని వాహన చోధకులు ప్రమాదాల భారిన పడుతున్నారన్నారు. అలాగే వాహనాలు ఢీకొని మూగజీవాలు కూడా గాయపడుతున్నాయన్నారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు శూన్యం అన్నారు. ఆయా ముగజీవాలకు మున్సిపాలిటీ బందిరి దొడ్డి ఏర్పాటు చేసి వాటికి మేత, నీరు, ఆరోగ్యానికి వైద్యం తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇప్పటికే వాహనాలు ఢీకొని పలు మూగ జీవాలు మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయన్నారు. మరికొన్ని అంగవైకల్యం చెందిన పరిస్థితులు ఉన్నాయన్నారు. అలాగే వాటి వలన ప్రయాణికులు పట్టణ మెయిన్ రోడ్డులో చిరు వ్యాపారులు గాయపడిన సందర్భాలు ఉన్నాయన్నారు. మూగజీవాలకు మేత దొరకక రోడ్డుపై దొరికే ప్లాస్టిక్, మైకా తదితర వాటిని తిని అనారోగ్యాల భారిన పడుతున్నాయన్నారు. ఆకలికి మేత కోసం చిరు వ్యాపారుల కూరగాయలు, ఆకుకూరలు, అరటి పళ్ళు తదితరవి లాగేసుకున్న తరుణంలో మూగ జీవాలు వారి చేతిలో దెబ్బలు కాసే పరిస్థితి లేకపోలేదన్నారు. దీనివల్ల వారికి కూడా నష్టం వాటిల్లతోందన్నారు. జిల్లా ఏర్పడిన మొదట్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సైకిల్ పై పట్టణ మెయిన్ రోడ్ లో పర్యటించి పశువులకు తగు షెల్టర్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఆదేశాలు కార్యరూపం దాల్చలేదన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి మూగ జీవాలకు షెల్టరు ఏర్పాటు చేయడం ద్వారా ఇటు ప్రజలను అటు మూగజీవాలు ప్రమాద బారిన పడకుండా రక్షించాలని జనసేన నాయకులు కోరారు.