జనసేన అధ్యర్యంలో మహిళలకు చీరలు పంపిణీ

రాజంపేట నియోజకవర్గం: సిద్ధవటం మండలం, ఉప్పరపల్లె గ్రామంలోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని మహిళలకు జనసేన నాయకులు పసుపు కుంకుమ చీరలు ప్రధానం చేశారు. జనసేన పార్టీ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు ఉప్పరపల్లె గ్రామానికి చెందిన జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మహిళలు అంటే ఆయనకు ఎంతో గౌరవం అని, వారికి సమాజంలో మరింత విలువలు పెరిగేలా పార్టీ తరఫున పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో రాణించేందుకు జనసేన కృషి చేస్తామన్నారు. అనంతరం మహిళలకు పసుపు కుంకుమ పండ్లు చీరలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు అబ్బిగారి గోపాల్, హేమంత్ కుమార్, జనసేన వీరమహిళ రాటాల వెంకటసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.