నేరస్తులకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించడం దుర్మార్గం: వినుత కోటా

టీటీడీ పాలక మండలి సభ్యుల ఎంపికపై జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆదివారం శ్రీమతి వినుత విలేకరులతో మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్ పదవికి ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు తప్ప మిగిలిన పేద వర్గాలు కనపడలేదని వాపోయారు. ప్రతి మీటింగులో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని ఊదరగొట్టే ముఖ్యమంత్రి జగన్ టీటీడీ చైర్మన్ పదవిలో ఆ వర్గాలు కనపడలేదా అని మండిపడ్డారు. గత ప్రభుత్వాలను టీటీడీ పాలక మండలి ఎంపికలో ఇతర రాష్ట్రాలకి చెందిన వారికి ఇవ్వడాన్ని విమర్శించిన జగన్ కి ఇప్పుడు తన ప్రభుత్వ ఎంపికలో గుర్తు రాలేదా! చెప్పేవి ఒక్కటి చేసేవి మరొకటి గా జగన్ వ్యవహారం ఉందన్నారు. లిక్కర్ స్కాం లో ఉన్న శరత్ చంద్ర రెడ్డి, ఆర్థిక నేరస్తుడు కేతన్ దేశాయ్ టీటీడీ పాలక మండలిలో పెట్టి తిరుమల ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారని, తిరుమల శ్రీవారి ప్రతిష్టతో ఆడుకున్న వారు కనపడకుండా పోయారని గుర్తు చేశారు. వీరికి పదవి కట్టబెట్టడంలో వారి స్కాంలో మీకు కూడా పాత్ర ఉందనే అనుమానం ప్రజలు వస్తుంది అని తెలిపారు. వెంటనే పాలక మండలిలో నియమించిన లిక్కర్ స్కాం నిందితుడు, ఆర్థిక నేరగాళ్లకు తొలగించాలని వినుత డిమాండ్ చేశారు.