మెయిన్ రోడ్డుకు మోక్షం కలిగించండి – జనసేన వినతి

  • చినుకు పడితే మెయిన్ రోడ్డు చెరువుగా మారుతోంది
  • కాలువలపై ఆక్రమణలు తొలగించి మురుగు తీత పనులు
  • చెత్త డంపింగ్ యార్డ్ తరలింపుకు చర్యలు చేపట్టండి
  • పశువుల బందిరి దొడ్డిని ఏర్పాటు చేయండి
  • పందులు, కుక్కల బెడద తగ్గించండి
  • జిల్లా జాయింట్ కలెక్టర్ ను కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డుకు మోక్షం కలిగించాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. సోమవారం ఆ పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ తదితరులు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావును కలిసి ఏమాత్రం చినుకులు పడినా చెరువుగా మారుతున్న పట్టణ మెయిన్ రోడ్డు సమస్యపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా పట్టణ మెయిన్ రోడ్డులో ఏమాత్రం వర్షం కురిసినా చెరువుగా మారుతొందన్నారు. సారికి వీధి జంక్షన్ నుండి కళామందిర్ థియేటర్ వరకు, అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ తదితర ప్రాంతాలు చినుకు పడితే చెరువుగా మారి, మూడు, నాలుగు అడుగుల మేర నీరు నిలబడి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తోందన్నారు. దీనికి కారణం పట్టణ మెయిన్ రోడ్ లోని మురుగు కాలువల్లో మురుగు తొలగించుకుపోవడమే అన్నారు. మురుగు కాలువలపై ఆక్రమణలు తొలగించి తక్షణమే కాలువల్లో మురుగు తలగింపు చర్యలు చేపట్టి మెయిన్ రోడ్డులో వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే పట్టణాన్ని వేధిస్తున్న చెత్త డంపింగ్ యార్డ్ తరలింపుకు చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డుపై విచ్చలవిడిగా తిరుగుతున్న పశువుల కోసం బందిరి దొడ్డి ఏర్పాటు చేయాలన్నారు. పందులు, కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. బెలగాం నుండి రాయగడ రోడ్డు వరకు మెయిన్ రోడ్ లో ఉన్న ఇరువైపులా మురుగు కాలువలపై వ్యాపారులు కొన్నిచోట్ల పక్కా కట్టడాలు నిర్మించడంతో మురుగు తీసే చర్యలు చేపట్టడం లేదన్నారు. కాబట్టి మురుగు కాలువలపై ఆక్రమణలు తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ కమిషనర్ జె.రామప్పలనాయుడుకు చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు.