కార్మికుల ఉసురు పోసుకుంటున్న వైసిపి ప్రభుత్వం: బొర్రా

  • భవన నిర్మాణ కార్మిక సంఘానికి జనసేన నేత బొర్రా మద్దతు

సత్తెనపల్లి, కూలి పనులు చేసుకుని పొట్టపోసుకునే భవన నిర్మాణ కార్మికుల డబ్బుల్ని కూడా దిగమింగి, బటన్ నొక్కుడు కార్యక్రమానికి ఉపయోగించిన జగన్మోహన్ రెడ్డి పేదల పాలిట శాపంగా మారాడని సత్తెనపల్లి జనసేనపార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు విమర్శించారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 2,246 క్లైములకు గాను 7 కోట్ల 23 లక్షల 64 వేల రూపాయిలు కార్మికశాఖ నుండి భవన నిర్మాణ కార్మికులకు బకాయిలు రావలసి ఉందని, అందులో సత్తెనపల్లి లేబర్ ఆఫీసు పరిధిలో 153 క్లైములకు 47 లక్షల రూపాయిలు పెండింగ్ ఉన్నాయని బొర్రా అన్నారు. సోమవారం కార్మిక సంఘ నాయకులు బొర్రాను, గుంటూరు జిల్లా జనసేనపార్టీ ప్రధానకార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావుని కలిసి తమ ఉద్యమాలకి మద్దతు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చాక తప్పుడు ఇసుక విధానంతో తన మొదటి దెబ్బ భవన నిర్మాణ కార్మికులపైనే గురిపెట్టాడని, వారి ఉసురు తగిలి వైసిపి ప్రభుత్వం నామరూపాల్లేకుండా పోతుందన్నారు. నాలుగేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ వైజాగ్ లో మొట్టమొదటిసారిగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ప్రశ్నించారన్నారు. జనసేన ప్రభుత్వంలోనే భవన నిర్మాణ కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు అభివృధ్ధి, సంక్షేమంతో ప్రగతి పధాన పయనిస్తారన్నారు. భవన నిర్మాణ కార్మికుల పోరాటాలకు జనసేనపార్టీ మద్దతు పూర్తిస్థాయిలో ఉంటుందని వారన్నారు. కార్మిక సంఘ నాయకులు అవ్వారు ప్రసాదరావు, తోట ఆంజనేయులు, జనసేన నాయకులు నాదెండ్ల నాగేశ్వరరావు, రంగిశెట్టి సుమన్, బత్తుల కేశవ, నామాల పుష్పలత తదితరులు పాల్గొన్నారు.