నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్

తెలంగాణలో పాత సచివాలయం కూల్చివేసి కొత్త సచివాలయం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నూతన సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ ఇవాళ పరిశీలించారు. ప్రధాన గేటుతో పాటు ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలను, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని సందర్శించారు. సెక్రటేరియట్ భవన నిర్మాణ ప్రాంగణం అంతా కలియదిరిగి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఇంజినీర్లు, వర్కింగ్ ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.

నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, అదే సమయంలో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వారికి స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, ఉన్నతాధికారులు ఉన్నారు.