వంతెన నిర్మాణం కోసం వర్షాకాలమనే కుంటి సాకులు చెప్పొద్దు

  • నదిలో వరదుంటే పూర్ణపాడు, లాభేసు గ్రామాల వైపు పనులు చేపట్టాలి
  • నిధులు ఉన్నాయా? కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నారా? అనే దానిపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి
  • పాలకులు, అధికారులను ప్రశ్నించిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలంలోని నాగావళి నదిపై పూర్ణపాడు – లాభేసు వంతెన నిర్మాణానికి సంబంధించి వర్షాకాలమనే కుంటి సాకులు చెప్పొద్దని జనసేన పార్టీ నాయకులు అన్నారు. గురువారం పూర్ణపాడు-లాభేసు వంతెన సాధన కమిటీ తరఫున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ తదితరులు మాట్లాడుతూ పూర్ణపాడు – లాభేసు వంతెన లేకపోవడంతో దాదాపు 60 గిరిజన గ్రామాలకు చెందిన గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏటా నాగావళి నదిలో మృత్యువాత పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ప్రతి ఏటా వంతెన నిర్మాణం పూర్తి చేసేందుకు పాలకులు, అధికారులు ఏవేవో లేనిపోని కుంటి సాకులు చెబుతూ వస్తున్నారన్నారు. ఇప్పుడు కూడా వర్షాకాలమనే ఒక కుంటి సాకును తయారుచేసి చెప్తున్నారన్నారు. వర్షాకాలం నదిలో ప్రవాహము ఉంటే నదిలో పనులు ఆపి, ఇటువైపు పూర్ణపడు అటువైపు లాభేసు గ్రామాల మధ్య మిగతా వంతన నిర్మాణం పనులు ప్రారంభించాలన్నారు. అంతే కాకుండా వంతెన నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల అయ్యాయా..? లేదా కాంట్రాక్టర్ పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారా..? బిల్లులు చెల్లింపులు జరిగాయా..? తదితర వాటిపై ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ముఖ్యంగా అధికారులు నాగావళి ఆవల ఉన్న గ్రామాల ప్రజలకు ప్రభుత్వ సిబ్బంది యొక్క సేవలు అందించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలంటే నదిలో ప్రాణాలకు తెగించి చిన్నపాటి వెదురుబొంగులు తెప్పలపై రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఎవరికి ఏ ప్రమాదం జరిగినా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా పాలకులు ఈసారైనా ఎన్నికల హామీకి వాడకుండా ఎన్నికల ముందే ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, తక్షణమే పనులు ప్రారంభిస్తున్నామని తమ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. లేని పక్షంలో పూర్ణపాడు లాభేసు వంతెన సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేయడం జరుగుతుందని హెచ్చరించారు.