కోహ్లీనే నా సారథి.. మా బంధంలో మార్పు లేదు..

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గైర్హాజరీలో ఆస్ట్రేలియాలో జట్టును అద్భుతంగా నడిపించిన రహానె.. తన నాయకత్వ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్నాడు. జట్టుకు సిరీస్‌ విజయాన్ని అందించి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. అయితే తనకు, కోహ్లీకి మధ్య బంధంలో మార్పేమీ లేదని.. అతడు తన కెప్టెనని, తాను ఉపసారథినని రహానె స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌తో కోహ్లీ తిరిగి నాయకత్వ పగ్గాలు అందుకోనుండగా.. రహానె మళ్లీ వైస్‌కెప్టెన్‌ పాత్రలోకి మారనున్నాడు. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఏమైనా భిన్నంగా ఉంటాయా అన్న ప్రశ్నకు రహానె బదులిస్తూ.. “మార్పులేమీ ఉండవు. విరాట్‌ ఎప్పటికీ టెస్టు జట్టు కెప్టెన్‌గా ఉంటాడు. నేను ఉపసారథిగా ఉంటా. అతడి గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహించడం, జట్టును విజయపథంలో నడిపించడానికి అత్యుత్తమ ప్రదర్శన చేయడం నా బాధ్యత” అని చెప్పాడు.