కుంగిన కానా కానరాదా …?

  • నెలలు గడుస్తున్నా చర్యలు శూన్యం
  • నిద్దరోతున్న రహదారులు భవనాల శాఖ
  • అంతర్రాష్ట్ర రహదారిలో ప్రమాదం జరగకముందే చర్యలు చేపట్టాలి
  • వై.కె.యం. కాలనీ సమీపంలో కుంగిన కానా వద్ద నిరసన తెలిపిన జనసేన పార్టీ నాయకులు

కుంగిన కానా కానరాలేదా…? అని జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించారు. శుక్రవారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి, వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, ఖాతా విశ్వేశ్వర రావు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, కిల్లాన అనంత్, సీతానగరం మండల అధ్యక్షుడు పాటి శ్రీనివాసరావు తదితరులు వైకెయం కాలనీ వద్ద అంతర్రాష్ట్ర రహదారిలో కుంగిన కానాకు మరమ్మత్తులు చేపట్టాలని కానా వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే అంతర్రాష్ట్ర ఒడిస్సా రహదారిలో ఖానా కుంగి పడిపోయి నెలలు కావస్తున్న పాలకుల్లో, అధికారుల్లో కనీస చలనం లేకపోవడం బాధాకరమన్నారు. నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగించే రహదారిలో జరగకూడని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రహదారులు భవనాల శాఖ నిద్రమత్తు వదలాలన్నారు. ఏ రోడ్డు చూసినా గోతులు మయమై ప్రజల ప్రయాణాలు సంకటంగా మారాయన్నారు. కొత్త రోడ్లు ఎలాగు వేయలేరు, కనీసం రహదారుల్లో ఏర్పడ్డ గోతులను పూడ్చే పరిస్థితిలో రహదారులు భవనాలు శాఖ లేకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో రహదారులు చూస్తే ప్రభుత్వ పాలన అర్థమవుతుందన్నారు. ఈ రహదారిలో జిల్లాకు చెందిన పాలకులు, అధికారులు నిత్యం తిరుగుతున్నా వారి కంటికి కృంగిన కానా కాన రాకపోవటం శోచనీయమన్నారు. తక్షణమే పాలకులు అధికారులు స్పందించి కాలనీ అంతర్రాష్ట్ర రహదారిలో కూలిపోయిన కానాను తగు చర్యలు చేపట్టాలని కోరారు. జరగరాని ప్రమాదం జరగకముందే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన పలువురు జనసైనికులు పాల్గొన్నారు.