కొండచరియలు విరిగిపడకుండా చర్యలు తీసుకోవాలి: జనసేన డిమాండ్

విజయవాడ: కనకదుర్గ ఘాట్ వద్ద సోమవారం ఉదయం కొండ చరియలు విరిగిపడటంతో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ సూచన మేరకు జనసేన పార్టీ ధార్మిక మండలి సభ్యులు సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం, నారంశెట్టి కూర్మారావు మాట్లాడుతూ గడిచిన ఈ రెండు నెలల్లోనే ఇలా కొండ చర్యలు విరిగిపడటం ఇది రెండవసారి దేవస్థాన అధికారులు కానీ, వైసిపి ప్రభుత్వం గానీ ఇతర విభాగాల అధికారులు గానీ సరైన శాశ్వత పరిష్కారాలు తీసుకోకపోవడం బాధాకరమని ఇకనైనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. మరొక సభ్యురాలు శానంపూడి శిరీష మాట్లాడుతూ అక్కడ ఉన్న అనేక మోటార్ సైకిల్లు పైన కొండ చరియలు పడడంతో అనేకమంది వాహనదారులు నష్టపోయారు. అదృష్టవశాత్తు ప్రాణ హాని జరగలేదు కానీ ఇది శ్రావణమాసం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, అలాగే రానున్న దసరా మహోత్సవాల్లో కూడా రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది, మరిన్ని వర్షాలు కూడా పడే అవకాశం ఉంది కావున స్థానిక నాయకులు మరియు అధికారులు మేల్కొని శాశ్వత పరిష్కారం చేయాలని కోరారు. అలాగే ఈ కార్యక్రమంలో మరి కొంతమంది సభ్యులు కరిమికొండ శివరామకృష్ణ, సుజాతా రావు, అడ్డగిరి పుల్లారావు, ఉదయ భాస్కర్, శ్యామ్ సుందర్, విజయవాడ టౌన్ కమిటీ కార్యదర్శి పాల రజని, రత్నం చిట్టి, రత్నం భవానీ తదితరులు పాల్గొన్నారు.