మేయర్ పదవికి కళంకం తెచ్చిన కావటి

  • ప్రజాక్షేత్రంలో విలువ కోల్పోయిన వైసీపీ నేతలు మతి తప్పి మాట్లాడుతున్నారు
  • అడుక్కో పోలీసు, అంగుళానికో బారికేడ్ పెట్టుకొని దమ్మూ ధైర్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదం
  • ముద్దు పేరుగా మారిన కమీషన్ల కావటి
  • కాపుల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడిన మనోహర్ కూ కాపు కులానికి సంభంధం లేదు
  • మేయర్ అయినప్పుడు సంతోషించిన కాపులే ఇప్పుడు చీదరించుకుంటున్నారు
  • పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి లేనిపక్షంలో భవిష్యత్ లో రాజకీయంగా భారీమూల్యం చెల్లించుకోక తప్పదు
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన గుంటూరు పట్టణానికి అత్యున్నత గౌరవప్రదమైన మేయర్ పదవిలో ఉంటూ ప్రతిపక్ష నాయకులపై సభ్యసమాజం సిగ్గుపడేలా అనుచితవ్యాఖ్యలు చేసిన నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు మేయర్ పదవికే కళంకం తెచ్చాడని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలియచేస్తున్న జనసేన పార్టీ కార్యకర్తల్ని గూండాలుగా అభివర్ణించటమే కాకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అసభ్య పదజాలంతో దూషించిన మేయర్ తీరుపై ఆయన మంగళవారం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సుమారు పది లక్షలమంది ప్రజలకు ప్రధమ పౌరుడిగా సేవలందించాల్సిన స్థాయిలో ఉన్న మనోహర్ నాయుడు తన కుహనా బుద్ధితో పతనావస్థకు చేరారని విమర్శించారు. పవన్ కల్యాణ్ పై వాడిన పదాలను మేయర్ కుటుంబ సభ్యులు కూడా ఆమోదించరన్నారు, రాజకీయంగా ఉన్నతస్థాయికి చేరాలి అంటే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని హితవు పలికారు. అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ప్రజల్లో, సొంత పార్టీలో విశ్వాసం కోల్పోయిన మనోహర్ గతి, మతి తప్పి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ముద్రగడ ఉద్యమాన్ని ఉపయోగించుకొని వైసీపీ కాపు నేతలు మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, కార్పొరేటర్లు అయ్యారు కానీ కాపులకు వాళ్ళు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు ఇవ్వనని ఖరాఖండిగా చెప్పటమే కాకుండా కాపు యువతకు సంవత్సరానికి ఇస్తానన్న రెండువేల కోట్లు ఇవ్వకపోతే కనీసం అడగటానికి కూడా దమ్ములేని మనోహర్ లాంటి వ్యక్తులకు కాపుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కాపుల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన మనోహర్ కు కాపు కులానికి ఎటువంటి సంభంధం లేదన్నారు. పేరులో కులం ఉండటం వల్ల ఉపయోగం లేదని ప్రవర్తనలో, మాట తీరులో కుల ప్రతిష్టను పెంచాలన్నారు. గుంటూరు నగరానికి మేయర్ అయినప్పుడు సంతోషించిన కాపులే ఇప్పుడు చీదరించుకుంటున్నారన్న విషయాన్ని గ్రహించాలన్నారు. దమ్మూ ధైర్యం గురించి వైసీపీ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, అవినీతి సొమ్ముతో బలిసిన కండల కన్నా నీతీ నిజాయితీలతో మరిగే రక్తానికే ధైర్యం ఎక్కువన్నారు. అడుగడుగునా పోలీసులు, అంగుళానికో బారికేడ్లు, మోచేతి నీళ్లు తాగే తాబేదార్లని పెట్టుకొని సవాల్ విసరడం, రెచ్చకొట్టడం వైసీపీ నేతలకే చెల్లిందన్నారు. పదిమంది వీరమహిళలకు సమాధానం చెప్పలేని వాళ్ళు సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని పొంది మరలా నాయకుడిగా ఎన్నుకోవాలి అంటే ప్రజలతో మమేకమవుతూ వారికి నిస్వార్థంగా సేవాలందించాలన్నారు. ప్రతిపక్ష నేతల్ని అసభ్యకరంగా దూషించి వారి వ్యక్తిత్వ హణనానికి పాల్పడితే సైకో అయిన మీ ముఖ్యమంత్రి సంతోషపడతాడేమో కానీ ప్రజల్లో విలువ కోల్పోతారన్న విషయాన్ని వైసీపీ నేతలు గ్రహిస్తే మంచిదన్నారు. అధికారం శాశ్వతం అన్న భ్రమలో నుంచి వైసీపీ నేతలు ఎంత తొందరగా బయటపడితే అంత మంచిదన్నారు. ఇప్పటికైనా ప్రజాగ్రహం నుంచి బయటపడాలి అంటే పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను మేయర్ మనోహర్ వెనక్కి తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో భవిష్యత్ లో రాజకీయంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని ఆళ్ళ హరి అన్నారు.