అరాచక పాలన కొనసాగిస్తున్న జగన్ రెడ్డికి కనువిప్పు కలిగించాలి

ఏలూరు: రౌడీలు, గుండాలు, దోపిడీదారులు అసెంబ్లీలో కూర్చొని ప్రజల తలరాతలు మారుస్తూ, విచ్ఛిన్నం చేస్తూ నాశనం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు పోయేకాలం దగ్గర పడిందని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అరాచక పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కలిగించాలని ఏలూరులోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో కలిసి రెడ్డి అప్పలనాయుడు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి దశ, దిశ చూపిన నాయకుడు, ఆర్థికంగా బలోపేతం చేసిన వ్యక్తి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించిన మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టి చంపాలనే కుట్రపూరితంగా సీఎం జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, చట్టాలను కాలరాస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ జగన్ రెడ్డి సారధ్యంలో నడుస్తున్న వైసిపి ప్రభుత్వం నిర్బంధాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు జగన్ రెడ్డి దుర్మార్గపు చర్యలను ఖండిస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ జరిగిందని చంద్రబాబుపై ప్రభుత్వం అక్రమ కేసు పెట్టి జైలుకు పంపిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రెండు లక్షల ముప్పై వేల మంది శిక్షణ పొందారని, సుమారు 70 వేల మందికి పైగా ఉద్యోగాలు సంపాదించారని ఈ విషయాలు జగన్ రెడ్డికి కనిపించడం లేదా అని నిలదీశారు. వాస్తవాలు ఉంటే ప్రజలందరికీ చూపాలని, కోర్టులో సబ్మిట్ చేయాలన్నా‌రు. ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రభుత్వ అక్రమాలు, అరాచకాలను ఖండిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తామంటే పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడం హేయమైన చర్య అన్నారు. ప్రజాస్వామ్యంలో అన్యాయం, అక్రమాలు జరుగుతున్నప్పుడు నిరసన తెలిపే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఉద్యోగులు సైతం 62 సంవత్సరాలు వచ్చేవరకు సర్వీస్ లో ఉంటారని ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉండే ప్రభుత్వానికి కొమ్ము కాస్తే ప్రజలు అసహ్యించుకుంటారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అనుసరిస్తూ చట్టాలను కాపాడుతూ ప్రజలకు మాత్రమే జవాబుదారిగా ఉండాలన్నారు. ఆరు నెలల్లో జగన్ రెడ్డి ప్రభుత్వానికి నూకలు చెల్లిపోతాయని, అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు రాష్ట్రంలోని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడుపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే టీడీపీతో కలిసి జనసేన పార్టీ ఈ ప్రభుత్వంపై పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఇల్లా శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఒబ్బిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షులు వీరంకి పండు, నగర కోశాధికారి పైడి లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.