నేటి నుంచి రెండో విడత ‘పంచాయతీ’ నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. రెండో విడతలో 3,335 పంచాయతీల సర్పంచ్‌లకు, 33,632 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కాగా, రెండో నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి 4వ తేదీన సాయంత్రం 4.30 వరకు కొనసాగనుంది. నామినేషన్లు వేయటం అయిపోయిన వెంటనే.. 5వ తేదీన అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు. ఇక 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించగా.. అదేరోజు నామినేషన్ల ఫైనల్ జాబితాను అధికారులు ప్రకటిస్తారు. ఇక 13వ తేదీన పోలింగ్ నిర్వహించి.. అదేరోజు సాయంత్రం లోపు ఫలితాలను ప్రకటిస్తారు.

ఇక తొలివిడత నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసిన విషయం తెలిసిందే. తొలివిడతలో 3,249 పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఫిబ్రవరి 9న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకూ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం ఫలితాలు విడుదల చేయనున్నారు.