ఎస్‌ఈసీపై మంత్రుల ఫిర్యాదు.. నేడు ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై మంత్రులు బొత్స సత్యనారాయణరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన సభాహక్కుల ఫిర్యాదుపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ మంగళవారం సమావేశం కానుంది. ఆన్‌లైన్‌ ద్వారా జరిగే ఈ సమావేశంలో మంత్రుల ఫిర్యాదును విచారించి ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌కు నోటీసు పంపే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై అసెంబ్లీ స్పీకర్‌ రూల్‌ 173 కింద స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రివిలేజ్‌ కమిటీకి సిఫారసు చేశారు. కమిటీ ఇచ్చిన నివేదిక అనంతరం ఎస్‌ఈసీ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎస్‌ఈసీ తరుచుగా సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖలు రాస్తూనే ఉన్నారు. మంత్రులు బొత్స, పెద్దరెడ్డితో పాటు మరుకొందరు లేఖలో హద్దు దాటుతున్నారంటూ లేఖలో గవర్నర్‌కు ఎస్‌ఈసీ ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇద్దరు మంత్రులు ఎస్‌ఈసీపై సభాహక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కమిషనర్‌పై వచ్చిన ఫిర్యాదుపై స్పీకర్‌ చర్యలను ప్రారంభించారు.