వారాహి యాత్ర 4వ దశను విజయవంతం చేయాలి

• పార్టీ జిల్లా, నగర అధ్యక్షుల సమావేశంలో నాదెండ్ల మనోహర్
• టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ నిర్ణయానికి జనామోదం ఉందన్న నేతలు

వారాహి నాలుగో దశ యాత్ర, తెలుగుదేశంతో కలసి రాబోయే ఎన్నికల్లో పోటీ, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, పార్టీ సంస్థాగత అంశాలపై ఈ రోజు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన జిల్లాల అధ్యక్షులు, నగర అధ్యక్షుల సమావేశంలో చర్చ జరిగింది. తొలుత ఈ అంశాలపై సమావేశంలో పాల్గొన్న నాయకుల అభిప్రాయాలను శ్రీ మనోహర్ గారు తెలుసుకున్నారు. అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. వారాహి యాత్ర అక్టోబర్ 1వ తేదీన అవనిగడ్డలో ప్రారంభం అవుతుందని, తదుపరి ప్రణాళికను కార్యక్రమాల నిర్వహణ కమిటీతో చర్చించిన తర్వాత ప్రకటిస్తామని తెలియచేశారు. ఒకటి, రెండు, మూడు దశల యాత్ర ఏ స్థాయిలో విజయవంతమయ్యాయో అందరికీ తెలుసు, అంతకు మించి నాలుగో విడత కార్యక్రమం విజయవంతం కావాలని, అందుకు నాయకులు, వీర మహిళలు, జన సైనికులు మనస్ఫూర్తిగా కృషి చేయాలని ఆయన కోరారు. వారాహి యాత్రలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించేలా నాయకులు కృషి చేయాలని, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి, ఆయన ప్రసంగాలు వినడానికి ఆశేషంగా ప్రజలు తరలివస్తున్నారని వారికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలుగుదేశంతో పొత్తు, ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణ గురించి మాట్లాడుతూ- విస్తృత స్థాయి సమావేశంలో ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారని, అయితే ఇరువురు నాయకులు చర్చించుకునే అవకాశం రాలేదని, అందువల్ల ఉమ్మడి కార్యాచరణ సాధ్యం కాలేదని తెలియచేశారు. తెలుగు దేశం చేస్తున్న ఆందోళనలకు జనసేన మద్దతు విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆయన నాయకులకు క్షుణ్ణంగా వివరించి దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం నాయకులతో ఎక్కడా పొరపొచ్చాలు రాకుండా చక్కటి సమన్వయంతో సానుకూల దృక్పథంతో సంప్రదింపుల ద్వారా ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలన్నారు. త్వరలోనే ఉమ్మడి కార్యచరణ సిద్ధమవుతుందని, అప్పటి వరకు సమయానుకూలంగా పార్టీ నియమావళికి లోబడి ముందుకు వెళ్లాలని సూచించారు. ఉమ్మడి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే స్థానికంగా ఉండే ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పటిలానే కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్వహణ విషయంలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
• పొత్తు నిర్ణయాన్నిసమర్థిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం
తెలుగుదేశంతో కలసి ఉమ్మడిగా పోటీ చేయాలన్న నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారని సమావేశంలో పాల్గొన్న జిల్లా, నగర అధ్యక్షులు వెల్లడించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రాబోయే ఎన్నికల్లో జనసేన-తెలుగుదేశం పార్టీలు కలసి పోటీ చేయాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ఈ సమావేశం ఆమోదం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, శ్రీ కొటికలపూడి గోవిందరావు, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీ షేక్ రియాజ్, శ్రీ టి.సి.వరుణ్, శ్రీ గాదె వెంకటేశ్వరరావు, శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, నగర అధ్యక్షులు శ్రీ పోతిన వెంకట మహేష్, శ్రీ యర్నాగుల శ్రీనివాస్, శ్రీ తోట సుధీర్, శ్రీ నేరెళ్ల సురేష్, శ్రీ జె.రాజారెడ్డి, శ్రీ మలగా రమేష్, శ్రీ సుజయ బాబు, శ్రీ పొదిలి బాబురావు పాల్గొన్నారు.
• తీర్మానం వివరాలు…
2014లో పార్టీని స్థాపించి గత తొమ్మిది సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం చేస్తున్న కృషి, ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడిన వైనాన్ని జనసేన జిల్లాలు, నగర అధ్యక్షుల సమావేశం కొనియాడింది. ఈ రోజున పార్టీ దృఢంగా నిలబడి ప్రజాసేవ చేస్తున్న విధానం, గ్రామ స్థాయిలో జనసేన బలంగా నిలదొక్కుకోవడంలోనూ అధ్యక్షుల వారి కృషి అసమానమని సమావేశం కొనియాడింది. వైసీపీ పాలనలో తీవ్రమైన వెనుకబాటుతనానికి గురవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించేందుకు జనసేన-తెలుగుదేశం ఉమ్మడిగా పోటీ చేయాలన్న నిర్ణయాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు వెల్లడించారు. ఉమ్మడిగా పోటీ చేసే విషయంలో బీజేపీ అగ్రనాయకత్వంతో కూడా మీరు సంప్రదింపులు జరుపుతానని ప్రకటించడం ఈ రాష్ట్రానికి శుభసూచకమని సమావేశం అభిప్రాయపడింది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రాబోయే ఎన్నికల్లో జనసేన – తెలుగుదేశం పార్టీలు కలసి పోటీ చేయాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లాల అధ్యక్షులు, నగర కమిటీల అధ్యక్షుల సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి, ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ, వైసీపీ విముక్త రాష్ట్రం కోసం మీరు చేస్తున్న అవిశ్రాంత పోరాటంలో సుశిక్షితులైన సైనికుల వలె వీర మహిళలతో కలసి మీ వెంట నడుస్తామని మీకు మాటిస్తూ.. ఈ రాష్ట్రం, ఈ ప్రజల కోసం మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తామని ఈ సమావేశం తీర్మానించింది.