వైసీపీ ప్రభుత్వంలో చనిపోయాక కూడా ప్రశాంతత లేదు

  • తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా అసమర్ధ పాలనపై నిప్పులు చెరిగిన జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: తమ అవినీతితో, అరాచకాలతో, దోపిడీలతో, దాష్టీకాలతో, భూ కబ్జాలతో పరిపాలనను గాలికిదిలేసి నాలుగున్నరేళ్లుగా ప్రజలకు బతికుండగానే నరకం చూపిస్తున్న వైసీపీ నేతలు చనిపోయాక కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ మండిపడ్డారు. సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి పాతగుంటూరు శ్మశానవాటికను పరిశీలించారు. తొమ్మిదిన్నరేళ్ల ముస్తఫా అసమర్ధ పాలనకు ప్రత్యక్ష నిదర్శనంగా పాతగుంటూరు హిందూ స్మశానవాటిక నిలుస్తుందంటూ విమర్శించారు. నటనలో కమల్ హాసన్ ని మించిపోయిన ఆయన ప్రజలు ఎమ్మెల్యేగా రెండుసార్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధిని గడప కూడా దాటించలేకపోయాడని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు, నగరపాలక సంస్థ పాలకమండలి ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా పవిత్రమైన శ్మశాన వాటికను బాగుచేయించటం మాత్రం చేతకాలేదని పాలకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సుమారు లక్షన్నర మందికి సంభందించి ఉన్న ఒకే ఒక్క శ్మశాన వాటికలో అధోగతిలో ఉన్న సదుపాయాలను, దుస్థితిని చూస్తుంటే ఈ ప్రాంతంలో ఎందుకు చనిపోయామా అని అనుకుంటామన్నారు. చనిపోయిన వారి అస్థికలు పెట్టుకోవటానికి కూడా సరైన సదుపాయాలు లేకపోవడం అత్యంత సిగ్గుచేటన్నారు. ఆడవాళ్ళ గాజులు, పుస్తెలు తీయటానికి అంతపెద్ద శ్మశాన వాటికలో చోటు లేదంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు అంటూ ధ్వజమెత్తారు. స్మశానానికి వచ్చిన వాళ్ళు స్నానం చేసేందుకు కూడా నీళ్ల సదుపాయం లేకపోవటం, అక్కడున్న బావిలో నీళ్లు కనీసం కాళ్ళు కడుక్కోవటానికి కూడా పనికిరాని అపరిశుభ్రంగా ఉండటం చూస్తుంటే హిందూ శ్మశాన వాటికలపై వైసీపీ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతుందన్నారు. పార్ధీవదేహాన్ని కూడా దహనం చేయటానికి సరైన వసతులు లేవని, ఒకవేళ పార్ధీవదేహం కాలే సమయంలో వర్షం వస్తే శవం సగం కాలిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కూర్చోవటానికి కూడా ఎక్కడా చోటు లేకపోవటం చూస్తుంటే పాలకులు ఈ శ్మశాన అభివృద్ధి పట్ల ఎంత సీతకన్ను వేశారో అర్ధమవుతుందన్నారు. చనిపోయిన వారిని ఈ శ్మశానానికి తీసుకురావాలి అంటే బతికున్నోళ్ల చావుకొస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇక్కడున్న కార్పొరేటర్ ప్రజల్ని పీడించుకు తినటానికి మినహా వార్డు అభివృద్ధి గురించి కానీ మౌలిక వసతులు గురించి కానీ పట్టించుకునే స్థితిలో లేడన్నారు. ప్రజలు ఎలాంటి వాళ్లకు ఓటేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు తక్షణమే స్పందించి, యుద్ధప్రాతిపదికన స్మశానవాటికను అభివృద్ధి చేయాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పెద్దఎత్తున జనసేన ఆందోళనలు చేపడుతుందని నేరేళ్ళ సురేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర కమిటీ సభ్యులు యడ్ల నాగమల్లేశ్వరరావు, చింతా రాజు, కటకంశెట్టి విజయలక్ష్మి, సూరిశెట్టి ఉదయ్, బండారు రవీంద్ర, కొత్తకోట ప్రసాద్, బుడంపాడు కోటి, నాగేంద్ర సింగ్, అందె వెంకటేశ్వర్లు, పులిగడ్డ గోపి, మిద్దె నాగరాజు, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దీన్, యాట్ల దుర్గ ప్రసాద్, రోశయ్య, మాదాసు శేఖర్, రజాక్, ఆషా, రాజనాల నాగలక్ష్మి, మహంకాళి శ్రీను, ఆయుబ్ ఖాన్, బడే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.