ఆళ్ళనానిని నిలదీయండి: రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మళ్లీ గడపగడపకు మన ప్రభుత్వం అంటూ వస్తున్న ఎమ్మెల్యే ఆళ్ల నానిని నిలదీయాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 6వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో రోడ్లు అద్వానంగా తయారయ్యి గోతులు దర్శనమిస్తున్నాయని, డ్రైనేజీ వ్యవస్థ లేదని, త్రాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారని, వీధిలైట్లు వెలగవని, కనీస మౌళిక సదుపాయాలు కల్పించలేని ఎమ్మెల్యే ఆళ్ల నాని మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల నాని నీచమైన సంస్కృతికి తెరదీశాడని, వైసీపీ పార్టీ వారికే మళ్లీ కండువాలు కప్పి జనసేన పార్టీలో చేరినట్లు కలరింగ్ ఇస్తున్నాడని ధ్వజమెత్తారు. పిల్ హౌస్ పేటలోని ప్రజలు రోడ్లపై ఉన్న గోతులతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే చోద్యం చూస్తున్నాడన్నారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ఓట్లు అడుక్కునేందుకు వస్తున్న ఎమ్మెల్యేను సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని నిలదీసి ప్రశ్నించాలని, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే నానిపై ఉందన్నారు. కుల సంఘాలను పిలిపించుకుంటూ సంఘానికి 500 లేదా 1000 గజాలు చొప్పున స్థలాలు ఇస్తానని చెప్పి ఊరికి దూరంగా ఇందిరమ్మ కాలనీ, మాదేపల్లి కాలనీల్లో ఇస్తూ ఎమ్మెల్యే కొత్త డ్రామా మొదలు పెట్టాడని ఆరోపించారు. ఈ నాలుగున్నర సంవత్సరాలు కాలంలో కుల సంఘాలు గుర్తుకు రాలేదా అని ఎమ్మెల్యేను రెడ్డి అప్పలనాయుడు నిలదీశారు. కాపులకు ఎమ్మెల్యే నాని వివాదాస్పదమైన భూమి కేటాయించి సంవత్సరాలు గడిచిపోయాయని, మళ్లీ మాయ మాటలు వల్లిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మళ్లీ ఓట్ల అడుక్కునేందుకు వస్తున్న ఎమ్మెల్యేకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందని, ప్రతి విషయం గమనిస్తున్నారని, మళ్లీ మభ్య పెట్టాలనుకుంటే ఇక కుదరదన్నారు.