భగత్ సింగ్ కాలనీలో భద్రతా చర్యలు చేపట్టండి: దుగ్గిశెట్టి సుజయ్ బాబు

నెల్లూరు, నెల్లూరు నగరంలోని 53, 54 డివిజన్ల పరిధిలో ఉన్న భగత్ సింగ్ కాలనీలో జరుగుతున్న పెన్నా నది రివిట్మెంట్ పనుల్లో భాగంగా ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్నారు. ఆదివారం ఆయన జనసైనికులతో కలిసి రివిట్మెంట్ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ఏడాది నవంబర్ నెలలో ఇదే ప్రాంతాన్ని తాము సందర్శించడం జరిగిందన్నారు. 3వేల పైచిలుకు ప్రజలు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారన్నారు. రివిట్మెంట్ పనులు జరుగుతున్న సందర్భంగా నదిలో పిల్లలు పడిపోయే ప్రమాదం జరుగుతుందని తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆరు నెలల క్రితం ఇద్దరు పిల్లలు ఆడుకునేందుకు వెళ్లి ఆ గుంటల్లో చిక్కుకున్నారని, వారిని రక్షించేందుకు వారి తల్లులు వెళ్లి మృత్యువాత పడ్డ విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాలుగు కిలోమీటర్ల మేర రివిట్టర్మెంట్ వాల్ కట్టాల్సి ఉండగా, కేవలం అర కిలోమీటర్ మాత్రమే పనులు ప్రారంభించారని, అవి కూడా నత్తనడకన సాగుతున్నాయని, అవి పూర్తి అయిన పాపాన పోలేదని విమర్శించారు. మరో నెలలో వర్షాకాలం ప్రారంభం అవుతుందని, సోమశిల నుంచి అధిక నీరు వచ్చే ప్రమాదం ఉందని, వెంటనే పనులు త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు పక్కనపెట్టి ఓట్లు వేసిన ప్రజల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. వెంటనే సైడ్ వాల్ నిర్మాణం చేపట్టాలని, లేనిపక్షంలో జనసేన ఆధ్వర్యంలో భిక్షాటన చేసి అయినా, చందాలు దండి పనులు చేసేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, నగర ప్రధాన కార్యదర్శి ఖంతర్, డివిజన్ ఇంచార్జిలు సుల్తాన్ బాషా, రాము, ఇంతియాజ్, వినయ్, జనసైనికులు తహసీన్, గణేష్, అఫ్రోజ్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.