రైతు పంటను కొనలేనిది రైతు ప్రభుత్వమా?

  • రైతులు అడిగిన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయలేకపోయారు
  • యంత్రాలు సకాలంలో అందించలేకపోయారు
  • గత ఖరీఫ్లో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయలేకపోయారు
  • రైతులే సాగునీటి కాలువల్లో పూడికలు తీసుకునే పరిస్థితి కల్పించారు
  • రైతుకు భరోసా కల్పించలేని రైతు భరోసా కేంద్రాలెందుకు?
  • ఇప్పుడు కనీసం మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని కోరిన జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం: రైతులు పండించే పంటను కొనుగోలు చేయలేని ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఎలా అవుతుందని జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఆదివారం జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, పసుపు రెడ్డి పూర్ణచంద్ర ప్రసాద్ లు పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు రైతులు పండించిన మొక్కజొన్న పంటను కొనుగోళ్ళు ప్రారంభించకపోవడంతో రైతులు పంటను వీధుల్లో పోసి అటు మధ్యవర్తులకి అమ్ముకోలేక, ప్రభుత్వం కొనుగోలు చేయక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ఖరీఫ్ లో కూడా రైతులు వద్ద ఉన్న ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయలేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడి చివరకు మధ్యవర్తులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోయారన్నారు. ఇప్పుడు కూడా మొక్కజొన్న విషయంలో అదే పరిస్థితి నెలకొందన్నారు. మాట్లాడితే పాలకులు, అధికారులు మాది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే వారు ఇపుడు రైతు పండించిన మొక్కజొన్న పంటను ఎందుకు కొనుగోలు చేయటం లేదని ప్రశ్నించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోలేక రైతు అవస్థలు పడుతుంటే అధికారులు పాలకులు చోద్యం చూస్తున్నారన్నారు. పండిన పంట వీధుల్లో పోసుకొని రైతులు పడి గాపులు కాస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2090లు ధర వస్తుందని రైతులు ఆశగా చూస్తున్నారని ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో కొంతమంది దళారులు రంగ ప్రవేశం చేసి రూ ఎం 1500 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారన్నారు. కనీసం దీనిపై కూడా అధికారులు నిఘా పెట్టడం లేదన్నారు. ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లాలో వాతావరణం అనుకూలించక ప్రభుత్వ సహకారం లేక జొన్న పంట సాగు తగ్గిందన్నారు. రైతు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో నష్టపోతున్న రైతు సాగుకు దూరం అవుతున్నాడన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ ఉద్దేశం కూడా రైతును వ్యవసాయం నుండి దూరం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలు రైతుల కోసం ఏర్పాటు చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు అధికారులు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఏ మేరకు భరోసా కల్పించారో ఒకసారి ఆలోచించాలి అన్నారు. గత ఖరీఫ్ లో రైతులు అడిగిన విత్తనాలు కానీ ఎరువులు కానీ సమకూర్చలేకపోయారన్నారు.. దీంతో రైతులు అధిక ధరలు చెల్లించి బయట కొనుక్కునే దుస్థితి నెలకొందన్నారు. అలాగే తగిన సమయంలో రైతులకు యంత్రాలు సరిపడా అందించలేకపోయారన్నారు. ప్రస్తుతం వర్షాలు లేక వరి పంట పొట్ట దశలో ఎండిపోతున్న సమయంలో సాగునీటి కాలువల్లో నీరు ప్రవహించకపోవటంతో రైతులే పూడిక తీత పనులు చేపట్టుకునే దుస్థితి జిల్లాలో నెలకొందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు జిల్లా అధికారులు తమది రైతు ప్రభుత్వం అని ఏ విధంగా చెప్పగలరని ప్రశ్నించారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి మొక్కజొన్న పంటను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గత ఖరీఫ్లో రైతులకు ఇవ్వాల్సిన రవాణా చార్జీలను కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లు తమ స్వంత ఖాతాలకు మళ్లించుకున్నారని వారిపై తగు చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరారు.